Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే 'షాడో' దురాక్రమణ
- రూ.20 కోట్ల భూమికి ఎసరు
- తప్పెవరిది..?
నవతెలంగాణ-వరంగల్
ఖిలావరంగల్ మండలం ఉర్సు శివారులో ఎమ్మెల్యే 'షాడో' సుమారు రూ.20 కోట్ల విలువైన 3.37 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొన్న వార్త నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తప్పెవరిది? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నగరవాసులు సహజంగానే 'కుడా' అప్రూవ్డ్ లే అవుట్ ఉన్న ప్లాట్లనే కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఇలా భావించడం వల్లే బృందావన్ ఎస్టేట్స్‌లో 105 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. 17 ఏండ్లుగా లేనిది ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సర్వే చేయాలని ఎందుకు అనిపించిందన్న ప్రశ్న ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 415 బృందావన్ ఎస్టేట్స్‌లో వుందని నిర్ధారిస్తూ రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగానే ఖిలావరంగల్ తహసీల్దార్, అధికారులు బృందావన్ ఎస్టేట్స్‌లో సర్వే నెంబర్ 415 చూపించిన స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చి 'ప్రభుత్వ స్థలం' అనే బోర్డు పెట్టారు. 'కుడా' అధికారులు బృందావన్ ఎస్టేట్స్‌కు సర్వే చేశాకే లే అవుట్ అప్రూవల్ ఇచ్చారు. ఒకసారి అప్రూవల్ ఇచ్చాక ఆ వెంచర్లో ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎలా చూపుతున్నా రనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో తప్పు రెవెన్యూ శాఖదా ? లేక 'కుడా' అధికారులదా..? తేల్చాల్సి ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
ఖిలావరంగల్ మండలం ఉర్సు శివారులో సర్వేనెంబర్ 415 భూమి ఎక్కడుంది ? ఇన్నేండ్లుగా రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు పట్టించుకున్నారు ? 'కుడా' అప్రూవ్డ్ లే అవుట్‌తో ఏర్పాటైన బృందావన్ ఎస్టేట్స్‌లో సర్వే నెంబర్ 415ను (ప్రభుత్వ భూమి) చూపించడం వెనుక అసలు భాగోతం ఏమిటీ ? అనేది నగరంలో చర్చనీయాంశంగా మారింది. బృందావన్ ఎస్టేట్స్‌లో 2004లో ఏర్పడితే అందులో 'కుడా' ఆమోదమున్న వెంచర్ అనే ఉద్దేశంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు సుమారు 105 మంది అందులో ప్లాట్లు కొనుగోలు చేశారు. 17 ఏండ్ల తర్వాత ఆ వెంచర్లో సర్వేనెంబర్ 415 ఉందని, అది ప్రభుత్వ భూమి అంటూ ఖిలావరంగల్ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో కలకలం రేపింది. దీంతో అసలు వాస్తవం ఏమిటీ ? తేల్చాల్సిన అవసరముంది. 'కుడా' అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 'కుడా' అప్రూవ్డ్ వెంచర్లో కూల్చివేతలు చేసే ముందు రెవెన్యూ అధికారులు కనీసం 'కుడా' అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోంది.
తిలా పాపం తలా పిడికెడు..
బృందావన్ ఎస్టేట్స్‌లో సర్వే నెంబర్ 415 ప్రభుత్వ భూమిని చూపించాల్సిన అవసరం ఎవరికి ఉందనేది చర్చకు దారి తీసింది. సమీపంలో వరంగల్ నగరంలోని ఒక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు 'షాడో'గా వ్యవహరించే వ్యక్తి గోదాములను నిర్మించుకున్నాడు. దాని పక్కనే ఉన్న సర్వే నెంబర్ 415ను ఆక్రమించుకొని ఆ సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని తాను ఆక్రమించుకున్నట్లు బహిర్గతం కాకుండా ఉండడానికి సమీపంలోని బృందావన్ ఎస్టేట్స్‌లో ఆ సర్వే నెంబర్ 415 ఉన్నట్లు రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకొని కొత్త డ్రామాకు తెరలేపాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, ఖిలావరంగల్ తహసీల్ కార్యాలయ అధికారులు పాత్రదారులుగా మారినట్టు విమర్శలున్నాయి.
రాజకీయ దుమారం
ఎమ్మెల్యే 'షాడో' ప్రభుత్వ స్థలం దురాక్రమణ నగరంలో రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే హస్తం కూడా ఉందా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉర్సు శివారులోని సర్వేనెంబర్ 415లో 3.37 ఎకరాల భూమి సుమారు రూ.20 కోట్లకుపైగా విలువ చేస్తుండడం గమనార్హం. చాలా తెలివిగా ఈ భూమిని కబ్జా చేసిన 'షాడో' ఆ భూమిని పక్కనే ఉన్న బృందావన్ ఎస్టేట్స్‌లో చూపించి చేతులు దులుపుకున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయ అధికారులకు, ఖిలా వరంగల్ తహసీల్ కార్యా లయ సిబ్బందికి భారీగా ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు బినామీగా ఉండడమే కాకుండా తెర వెనక ఆర్ధిక వ్యవహారాలన్నీ 'షాడో' నడుపుతాడనే ప్రచారం ఉంది. దీంతో తనకున్న పరపతి, ఆర్ధిక బలంతో అధికారులను తనవైపు తిప్పుకొని తానే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలాన్ని మరో వెంచర్లో చూపించి తెలివిగా ఆర్ధికంగా లబ్ది పొంది బృందావన్ రియల్ ఎస్టేట్‌లో కొనుగోలు చేసిన సామా న్యులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు 'షాడో' పనికి రోడ్డున పడి ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నారు. 17 ఏండ్ల తర్వాత భూవివాదం చోటు చేసుకోవడం అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. దీనికి ఖిలావరంగల్ తహసీల్దార్, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సర్వే నివేదిక ఆధారంగానే కట్టడాలు కూల్చేశామని చెబుతుండగా ఏడీ ఎందుకు, ఎవరు సర్వే చేయమంటే చేశారన్నది బహిర్గతం కావాల్సి ఉంది. ఏది ఏమైనా సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని ప్లాట్ల యజమానులు కోరుతున్నారు.