Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేజావత్ రాంసింగ్ తండాలో కొనసాగుతున్న ఆందోళన
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన
- ఉద్యోగమిస్తాం, ఆదుకుంటాం : మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్/గూడూరు
కేయూలో ఆత్మహత్యకు యత్నించిన బోడ సునీల్ నాయక్ చికిత్స పొందుతూ నిమ్స్‌లో పరిస్థితి విషమించి మృతి చెందడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేఏపింది. సునీల్ మృతి వార్త దావానలంలా వ్యాపించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విద్యార్థి, యువజన, గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసాన్ని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్యూఐ, డీవైఎఫ్ఐ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు. సునీల్ నాయక్ మృతదేహాన్ని హైదరాబాద్‌లోని నిమ్స్ నుంచి మహబూబాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామమైన తేజావత్ రాంసింగ్ తండాకు తీసుకురావడంలో పోలీసు, అధికార యంత్రాంగం హైడ్రామా నడిపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సీఎం కేసీఆర్‌ను విద్యార్థులు వదలొద్దని సునీల్‌నాయక్ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం గమనార్హం. సునీల్ స్వగ్రామానికి శవాన్ని తీసుకురాగా సాయంత్రం 4 గంటల నుంచి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబీకులు, తండావాసులు, మండల ప్రజలే కాకుండా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థి, యువజన, గిరిజన, సంఘాల నాయకులు తరలివచ్చి పాల్గొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో సునీల్ కుటుంబీకులు ఆందోళన కొనసాగించారు. మృతుడి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని చర్చలు జరిపారు. రాత్రి 10 గంటల వరకు సైతం ఆందోళన కొనసాగింది.
ఉద్యోగమిస్తాం, ఆదుకుంటాం : సత్యవతి
సునీల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అంత్యక్రియల కోసం లక్ష రూపాయల తక్షణ సాయం, బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయడంతోపాటు ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సునీల్ మృతి బాధాకరమని ఆమె పేర్కొన్నారు.