Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడవయ్య
నవతెలంగాణ-జనగామ
తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగుల సహాయకులకు రూ.20 వేలు ప్రత్యేక అలవెన్సు చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి అడవయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆడవయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న 32 రకాల సమస్యలపై సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వేలో వెలుగు చూసిన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగుల తలిదండ్రులకు నెలకు రూ.3 వేలు చొప్పున అలవెన్సు చెల్లించాలని, పెండింగ్‌లో పింఛను దరఖాస్తులకు వెంటనే నిధులు విడుదల చేయాలని, వికలాంగుల స్వయం ఉపాధికి షరతుల్లేకుండా 10 లక్షల ఆర్థికసాయం అందించాలని, వికలాంగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని చేయాలని, నామినేటెడ్ పోస్టుల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని, మెట్రో, డీలక్స్, హైటెక్ బస్సుల్లో వికలాంగులను అనుమతించాలని, పెండింగ్‌లో ఉన్న వివాహ ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 21 రకాల వైకల్యాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. వికలాంగులకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్, జిల్లా కమిటీ సభ్యులు తోట సురేందర్, మాలోతు రాజ్‌కుమార్, పిట్టల కుమార్, ఉప్పరి వేణు, పులిగిల్ల రాజయ్య, ప్రతాపగిరి రవికుమార్, బండవరం శ్రీదేవి, ఆకారపు కుమార్, భూమా రజిత, ఇట్టబోయిన మధు, నాచు అరుణ, పులి మంజుల, రడపాక యాదగిరి, పిట్టల రజిత, తదితరులు పాల్గొన్నారు.