Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయకట్టు రైతుల్లో హర్షం
నవతెలంగాణ-నర్సంపేట
మాధన్నపేట చెరువులోకి గోదావరి జలాలు చేరుకొన్నాయి. గోదావరి జలాల రాకతో ఆయకట్టంతటికీ సాగు నీరందతుందని హర్షం వెలుబుచ్చుతూ బరోసా వ్యక్తం చేస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేస్-3, ప్యాకేజీ 5 ద్వారా రామప్ప చెరువు రిజర్వాయర్ పంప్ హౌజ్ నుంచి కొద్ది రోజులుగా రంగయ చెరువులోకి నీరు చేరుకొని నిండుకుండగా మారింది. అక్కడి నుంచి దిగువ భాగంలోని మాధన్నపేట చెరువు వరకు 15 కిలో మీటర్ల నిడివి కలిగిన వాగులోకి నీటిని విడుదల చేశారు. కొద్ది రోజుల నుంచి నిరంతరంగా అత్యధిక సామర్ధ్యంతో నీరు చెరువులోకి నీరు చేరుకొంటుంది. 2400 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం కలిగిన మాధన్నపేట చెరువు కింద 925 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో యాసంగి సాగు చేశారు.చెరువులో 7.6 అడుగుల నీటిమట్టం ఉంది. చెరువు శిఖం, వాగు పరివాహకంలో 500 ఎకరాల పైగా వరి, మొక్కజొన్న సాగు చేసినట్లు తెల్సుతుంది. ఇటివల ఎండ తీవ్రత పెరగడంతో చెరువులో నీరు తగ్గుతూ వస్తుంది. రంగయ చెరువు నుంచి విడుదలైన నీటితో మాధన్నపేట చెరువులోకి నీరు చేరుకొంటుంది. ఈ నీటిని చెరువు శిఖంలో, వాగు నీటిపై ఆధారపడి సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు రైతులు మోటర్లతో ఎత్తిపోస్తున్నారు. నిన్నటి వరకు చివరి తడిపై రైతులు బెంగపడ్డారు. విడుదలైన నీటితో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఎకరాకు సాగు నీరు..రైతుల దిగులు చెందాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే పెద్ది
యాసంగిలో సాగు చేసిన ఆయకట్టంతటికీ సాగు నీరందుతుందిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మాధన్నపేట పెద్ద చెరువును సందర్శించి జళకలను వీక్షించారు. రంగయ చెరువు నుంచి నీరు చేరుకొంటున్న తీరును చూసి ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి నిరంతర శ్రమ ఫలితంగా చెరువులు నిండుకుండా మారాయన్నారు. నియోజవర్గంలో ఎస్సారెస్పీ కాల్వలకు అనుసంధానంగా ఉన్న ప్రతి చెరువును నింపి యాసంగి ఆయకట్టంతటికీ సరిపడా సాగు నీరు అందించామన్నారు. రంగయ్య చెరువు నిండుకొందని అక్కడి నుంచి వాగు మార్గంలో మాధన్నపేట చెరువులోకి విడుదల చేయడం వల్ల ఆయకట్టుతో పాటు వాగు సమీపంలో, చెరువు శిఖంలో సాగు చేసిన పంటలకు కూడా నీరందుతుందని తెలిపారు. యాసంగి సాగుపై రైతులు ఇకపై దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో మాధన్నపేట చెరువులోకి ఎస్సారెస్పీ డీబీఎం 38/11ఆర్ కాల్వ నుంచి నీటి మళ్లిస్తామని చెప్పారు.నియోజవర్గంలోని అన్ని చెరువుల కింద యాసంగి సాగు తధ్యమని రైతుల్లో మరింత విశ్వాసాన్ని నింపుతామన్నారు.