Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతక్కకు కన్నాయిగూడెం పోడురైతుల వినతి
నవతెలంగాణ-ములుగు/కన్నాయిగూడెం
పోడు రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కన్నాయిగూడెం మండలానికి చెందిన పోడురైతులు శనివారం నాడు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్కను కలిసి తమపై దాడులు ఆపాలని, పట్టాలిప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. కొద్ది రోజులుగా పోడురైతులపై అటవీ శాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం నాడు బుట్టాయిగూడెం, సర్వాయి గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ట్రెంచ్ కొట్టి దౌర్జన్యాలకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడుభూములకు పట్టాలిస్తామని2014లో ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఏడేండ్లు గడచినా పట్టాలివ్వకపోగా ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే కుట్ర చేస్తోందని తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో తాను ప్రభుత్వాన్ని నిలదీయగా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన మంత్రి ప్రస్తుతం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే దాడులను ఆపాలని స్పష్టం చేశారు. పోడురైతులకు అండగా పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని సీతక్క తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, ప్రభుత్వం పోడురైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, జిల్లా కార్యదర్శి అజ్జు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భద్రూనాయక్, దేవ్‌సింగ్, తోట ప్రవీణ్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, మేడం రమణాకర్, కన్నాయిగూడెం మండల రైతులు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జాడి రాంబాబు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునారికాని రాంబాబు, బీసీ సెల్ అధ్యక్షులు కటకం మల్లన్న, తదితరులు పాల్గొన్నారు.