Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కుడా' అప్రూవ్డ్ ప్లాట్లకు రక్షణ ఉందా?
- తప్పు ఎవరిది
- సర్వత్రా సందేహాలు
నవతెలంగాణ-వరంగల్
ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులో సర్వే నెంబర్ 415 కుడా అప్రూవ్డ్ లే అవుట్ పొందిన బృందావన్ ఎస్టేట్స్‌లో లేదు. కానీ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాల యం సిబ్బంది ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందని, ఆ నెంబర్ బృందావన్ ఎస్టేట్స్ వెంచర్‌లోనూ ఉందని నివేదిక ఇచ్చింది. ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ వెంచర్‌లోని పలు కట్టడాలను కూల్చివేశామని ఖిలా వరంగల్ తహసీల్ కార్యాలయ అధికారుల వాదన. ఈ వాదనలు ఇలా ఉండగా 2004లో బృందావన్ ఎస్టేట్స్‌కు కుడా అధికారులు లే అవుట్‌ను ఆమోదించారు. అప్పుడు అభ్యంతరం చెప్పని రెవెన్యూ అధికారులు 17 ఏండ్లు గడిచాక మళ్లీ సర్వే చేసి అందులో ప్రభుత్వ భూమి ఉందని చెప్పడం అనేక సందేహాలకు తావిస్తోంది. శనివారం 'నవతెలంగాణ' ఈ వెంచర్‌ను సంద ర్శించింది. ఈ సందర్భంగా పలువురు స్థానికుల కథనం రెవెన్యూ అధికారులు వ్యవహారశైలిపై అనుమానాలను మరింత పెంచాయి. ప్రభుత్వ స్థలంగా చెబుతున్న సర్వే నెంబర్ 415లో బిగ్ షాట్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ ఎమ్మెల్యే 'షాడో' గోదాముతోపాటు పొలం కూడా ఉంది. పలువురు ఈ సర్వే నెంబర్లో భవనాలను రెగ్యులరైజ్ చేసు కున్నారు. ఈ భూమిని కాదని ఖిలా వరంగల్ రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 415ను వెంచర్లో చూపిస్తూ సంపన్నులైన కబ్జాదారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులోని సర్వేనెంబర్ 415లో 3.37 ఎకరాల ప్రభుత్వ స్థలముంది. 2004లో బృందావన్ ఎస్టేట్స్‌ను లే అవుట్ చేసే క్రమంలో సర్వే చేశాకే 'కుడా' అధికారులు లే అవుట్‌ను ఆమోదించారు. ఈ సర్వే నెంబర్ బృందావన్ ఎస్టేట్స్ పరిధిలో లేదు. అయినా ఖిలావరంగల్ తహశిల్దార్ కార్యాలయం అధికారులు సర్వేనెంబర్ 415 (ప్రభుత్వ భూమి) ఈ వెంచర్లో వుందని బృందావన్ ఎస్టేట్స్‌లోని పలు ప్రహరీలను, షెడ్లను కూల్చి వేశారు. దీంతో ఖంగుతిన్న ప్లాట్ల యజమానులు వెంచర్ యజమానులను నిలదీశారు. వెంచర్ యజమానులు కుడా అధికారులు సర్వే చేశాకే వెంచర్లో ప్లాట్లు చేసి విక్రయించినట్లు అన్ని ధృవీకరణ పత్రాలను చూపిస్తున్నారు. ఏది ఏమైనా కుడా అధికారులే ఈ విషయాన్ని తేల్చాలని యజమానులు చెబుతున్నారు.
సర్వే నెంబర్ 415ను గుర్తించడంలో లోపాలు..?
ఉర్సు శివారులోని సర్వే నెంబర్ 415లో ప్రభుత్వ స్థలం 3.37 ఎకరాలుంది. బృందావన్ వెంచర్ పక్కనున్న 30 అడుగుల దారి ఈ ప్రభుత్వ స్థలంలోనే ఉంది. 'నవతెలంగాణ' సందర్శనలో ఈ వెంచర్‌కు తూర్పు వైపు సరిహద్దుగా 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్స్ వేసి ఉన్నాయి. ఈ పిల్లర్ల నుంచి తూర్పు దిశగా మరిన్ని 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్లున్నాయి. కానీ రెవెన్యూ అధికారులు ఈ సర్వే నెంబర్‌ను తూర్పు వైపున కాకుండా, పశ్చిమ వైపునున్న బృందావన్ వెంచర్లోకి చొచ్చుకుపోయి సరిహద్దులు పెట్టడం సందేహాలకు తావిస్తోంది. 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్స్‌ను రెవెన్యూ అధికారులే ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ పిల్లర్లను ఆధారంగా చేసుకొని కొలతలు వేయాల్సిన ఖిలా వరంగల్ తహశిల్దార్ రెవెన్యూ అధికారులు తూర్పువైపు కొలతలు వేయకుండా పశ్చిమ వైపు వెంచర్లోకి చొచ్చుకుపోవడంలోని ఔచిత్యాన్ని ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. శనివారం 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్లు ఎక్కడెక్కడున్నాయో ప్లాట్ల యజమానులు 'నవతెలంగాణ'కు చూపించారు. సర్వేనెంబర్ 415 భూమి తూర్పున ఉంటే పశ్చిమంలో చూపించడానికి గల కారణాలను రెవెన్యూ అధికారులు బహిర్గతం చేయాల్సి వుంది. ఒకవేళ వెంచర్లోకి చొచ్చుకుపోయి వేసిన సరిహద్దులే సరైనవైతే, మరి తూర్పున వున్న 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తేల్చి చెప్పాల్సిన బాధ్యత ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
సర్వే నెంబర్ 415లో పేదల పట్టాలు..?
ఉర్సు శివారులోని సర్వేనెంబర్ 415లో 3.37 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు నాటి ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య నేతృత్వంలో పట్టాలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ స్థలంలో 'గవర్నమెంట్ ల్యాండ్' పిల్లర్లున్నా, ఈ పిల్లర్లను బట్టి కాకుండా ఖిలా వరంగల్ రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే బృందావన్ వెంచర్లోకి చొచ్చుకుపోయి హద్దులు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు 415లో ఎవరున్నారు..?
ప్రభుత్వ స్థలంగా చెబుతున్న సర్వేనెంబర్ 415లో వరంగల్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహతుడైన 'షాడో' గోదాములున్నాయి. ఈ గోదాముల కింద ప్రభుత్వ స్థలము ందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆ 'షాడో' ఇదే సర్వే నెంబర్లోని కొంత పొలాన్ని కొనుగోలు చేసి వరి సాగు చేస్తున్నాడు. దాని చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయ డం గమనార్హం. 'షాడో' తన డాక్యుమెంట్లో సర్వే నెంబర్ 415ను కాకుండా 410ని చూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ గోదాములు మాత్రం సర్వే నెంబర్ 415 ప్రభుత్వ స్థలంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ గోదాముల పక్కన రెండం తస్తుల భవనం నిర్మితమై ఉంది. వీరు కూడా సర్వేనెంబర్ 415లో ఉండడంతో రెగ్యు లరైజేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వ భూమిలో సంపన్నులు కబ్జా చేసినా పట్టించుకోని ఖిలా వరంగల్ రెవెన్యూ అధికారులు వెంచర్లో సర్వేనెంబర్ 415లోని ప్రభుత్వ భూమిని చూపించి సంపన్నులకు కొమ్ము కాస్తున్నట్టు విమర్శలున్నాయి.
వివాదాన్ని కుడా పరిష్కరించాలి..: బీఎస్ మూర్తి
2004లో బృందావన్ రియల్ ఎస్టేట్స్‌ను ప్రారంభించి ప్లాట్లు చేసిన లే అవుట్‌కు 'కుడా' అప్రూవ్ చేసిందని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు రెవెన్యూ అధికారులు సృష్టించడం పట్ల ఆ సంస్థ యజమాని మూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అదికారుల అభ్యంతరాలను తెలుసుకొని 'కుడా' అధికారులు ఈ వివాదాన్ని పరిష్కరించాలని మూర్తి కోరారు. సర్వేనెంబర్ 415 మా వెంచర్లో లేకపోయినా ఖిలా వరంగల్ రెవెన్యూ అధికారులు వెంచర్లో ఉందని కట్టడాలను కూల్చడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లే అవుట్‌ను ఆమోదించేటప్పుడే సర్వే చేశారని, ఇప్పుడు ఆ సర్వేకు పూర్తి భిన్నంగా వెంచర్లో సర్వేనెంబర్ 415 వుందని చెప్పడం సరైంది కాదన్నారు. 17 ఏండ్లుగా లేని వివాదాలను ఇప్పుడు సృష్టించడంలోని ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదన్నారు. ఏదేమైనా 'కుడా' అప్రూవ్డ్ లే అవుట్ వుండడం వల్లే చాలా మంది మా బృందావన్‌లో ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. 'కుడా' అప్రూవ్డ్ లే అవుట్‌కే రక్షణ లేకపోతే సామాన్యులు ఇంకే వెంచర్‌ను నమ్ముతారని ప్రశ్నించారు. 'కుడా' అధికారులు జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలన్నారు.