Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనపర్చుకొని అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. సోమవారం కాకతీయ నగర్ పక్కన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసిన గుడిసెల ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలోని 601 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో నిలువనిడలేని నిరుపేదలు 5 రోజులు గుడిసెలు వేసి పట్టాలు ఇవ్వాలని కోరుతూ నివసిస్తున్నారని తెలిపారు. 601 సర్వే నంబర్ లో మొత్తం 5.33 ఎకరాలలు ఉండగా 2.33 ఎకరాలకు కొందరికి అసైండ్ చేయబడిందని తెలిపారు. ఈ మేరకు 2016లో అప్పటి తహసీల్దార్ ఉమారాణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించారన్నారు. అప్పటి సర్వే నివేదికలో ఒక ఎకరం తక్కువగా చూపిస్తూ సర్వేయర్ ట్రై యాంగిల్లో పోయిందని సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి కొమ్ముకాచి ముడు పులు తీసుకుని ప్రభుత్వ భూమిని లేకుండా చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ భూమి చుట్టు హద్దులు కేటాయించి పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు. లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు చేపట్టి భూమిని రక్షించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అనంతగిరి రవి, నాయకులు ముంజల సాయిలు, గడ్డమీది బాలకష్ణ, గుజ్జుల ఉమా, పేదలు తదితరులు పాల్గొన్నారు.