Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలపై ఉద్యమించాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న కోరారు. మండల కేంద్రంలో వెన్ను ఎల్లయ్య అధ్యక్షతన ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశం సోమవారం నిర్వహించారు.. తొలుత నిరుద్యోగ యువకుడు బోడ సునీల్, ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల స్మృత్యర్ధం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళ్లర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకన్న మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వ్యవసాయ వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాడాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మర్రిపెల్లి మొగిలి, సభ్యులుగా వెన్ను ఎల్లయ్య, సలీమ్, జాటోత్ బిచ్యానాయక్, అనుముల రమేష్, నాగవెల్లి రఘు, వేల్పుల వెంకన్న, సట్ల వెంకన్న, చాపల మహేందర్ ఎన్నికయ్యారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నూకల ఉపేందర్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.