Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నట్వర్
నవతెలంగాణ-తొర్రూరు
బైక్ మెకానిక్ శిక్షణ గొప్ప సదవకాశమని బైక్ మెకానిక్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మాడుగుల నట్వర్ తెలిపారు. బైక్ మెకానిక్లకు శిక్షణ ఇప్పించి షాప్ పెట్టుకోవడానికి లోన్ ఇప్పించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నట్వర్ మాట్లాడారు. బైక్ మెకానిక్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పొద్దంతా కష్టపడ్డా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేకసార్లు ఆందోళనలు నిర్వహించి బైక్ మెకానిక్ల జీవన పరిస్థితులను రాష్ట్ర కమిటీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా సీఎం కేసీఆర్ స్పందించారని తెలిపారు. కేవలం బీసీలకు మాత్రమే అవకాశం కల్పించడం సరికాదని, ప్రభుత్వం పునరాలోచించి కుల మతాలకు అతీతంగా అన్ని తరగతులకు శిక్షణ అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సామల రాజు, జిల్లా నాయకుడు నిమ్మల శేఖర్, తొర్రూర్ అధ్యక్షుడు పాషా, ఉపాధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తోట శేషు, కోశాధికారి సతీష్, సీనియర్ మెకానిక్లు ధరావత్ కిషన్, మారిపెల్లి గోపీ, హుజూర్, సైదులు, ఖాజా, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.