Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నగర కార్యదర్శి షేక్ బాష్మియా
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ప్రజా సమస్యలపై అలుపెరగకుండా పోరాడాలని సీపీఐ నగర కార్యదర్శి షేక్ భాష్మియా అన్నారు. సోమవారం శివనగర్‌లోని తమ్మెర భవన్లో కామ్రేడ్ దండు లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నాయని వాపోయారు. తాగునీటి ఎద్దడి నగర వ్యాప్తంగా ఉందని, నగరంలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని తెలిపారు. ఆరేండ్ల పాలన కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విభజన చట్టంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోట బిక్షపతి, నగర సహాయ కార్యదర్శులు బుస్స రవీందర్, గన్నారపు రమేష్, నగర కార్యవర్గ సభ్యులు మద్దెల ఎల్లేష్, గుండె బద్రి, సంగీ ఏలేందర్, ఓర్సు రాజు, డప్పు రవి, సండ్ర కుమార్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.