Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలాపున గోదారి జలాల కాలువ
- ఎత్తి పోతున్న బోర్లు.. ఎండిపోతున్న వరి చేలు
- బీడుగా సాగు భూములు
నవతెలంగాణ-నర్మెట్ట
రైతులను యాసంగి పంట ముంచేస్తోంది. గత ఖరీఫ్‌లో పంట చేతికొచ్చే తరుణంలో అకాల భారీ వర్షాలతో రైతులు తీంగా నష్టపోయారు. ప్రస్తుత రబీలో పంట చేతికొచ్చే సమయానికి బోర్లు ఎత్తి పోతున్నాయి. తలాపున గోదావరి జలాలు ఉన్నా అన్ని గ్రామాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. ఇందుకు నర్మె మండల రైతులే నిదర్శనం.
మండలంలోని ఇసుక బాయి తండా, లోకియా తండా, సూర్య బండ తండ, మచ్చు పహాడ్ గ్రామాలకు బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ కాలువ మలకపేట మీదుగా ఈ గ్రామాలకు రావాల్సి ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించిన ఎత్తిపోతల పథకంతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందక వేసుకున్న పంటలు ఎండిపోతు న్నాయి. పంట సాగుకు వేల రూపా యలు ఖర్చు పెట్టి బోర్లు వేసి నష్టపోయామని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు కాలువల ద్వారా అందించాలని నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టిన ప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 700 అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేక పశువులను పొలాల్లో మేపుతున్నారు. కొంతమంది రైతులు చేతికొచ్చిన పంటను కాపాడుకునేందు కు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మండలంలో యాసంగిలో 7638 ఎకరాల పంట సాగు చేశారు. వర్షాకాలం సీజన్ లో భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు వద్ధి చెందాయి. చెరువుల్లో, కుంటల్లో బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ క్రమంలో ఎండలు పెరగడం... బోర్లు అధికంగా వేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో మండలవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 1500 ఎకరాల పంట ఎండిపోయింది. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ రైతులకు ఇస్తామని చెప్పినా 12 గంటలు మాత్రమే వస్తోంది. బోరు నీళ్లు అధికంగా ఉన్న రైతుల నుంచి ఎకరాకు రూ.7వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చి నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన రైతులను కోరుతున్నారు.
రెండున్నర ఎకరాలు ఎండిపోయింది : లింగాల రమేష్
వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు పడడంతో వరి పంట అధికంగా సాగు చేశాను. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. నాకున్న 5ఎకరాల్లో వరి పంట సాగు చేయగా రెండున్నర ఎకరాలకు పైగా ఎండిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
అప్పులపాలవుతున్నాం : పుల్లయ్య, రైతు, మచ్చు పహాడ్
యాభై ఏండ్లుగా నేను వ్యవసాయం చేస్తున్నా. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది బోర్లు అధికంగా ఎండిపోయాయి. వర్షాకాలంలో వర్షాలు సమద్ధిగా పడడంతో ఉన్న 3 ఎకరాల్లో రెండెకరాల పొలం ఎకరం మొక్కజొన్న వేశాను. దాదాపు రూ.70 వేల ఖర్చు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం నీరు లేక పంట ఎండిపోతోంది. ఉన్న బోర్లు ఎండిపోవడంతో అప్పు చేసి 650 ఫీట్ల వరకు మరో బోరు వేశాను. చుక్క నీరు పడలేదు. దీంతో రూ.85వేల వరకు నష్టపోయాను. మొత్తానికి రూ.లక్ష50వేల వరకు అప్పులపాలైన. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పంటను కాపాడుకోవాలి
ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు అధికంగా కురవడంతో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో బోర్లు ఎండిపోయాయి. దీంతో పంట నష్టం వాటిల్లి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బొమ్మకూర్ రిజర్వాయర్ ఎడమ కాలువ పనులు గత కాంట్రాక్టర్ నిధులు సరిపోవట్లేదని ఆపేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు కృషి చేస్తాం. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరందట్లేదు. రైతులుప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా యాసంగి పంటను కాపాడుకోవాలి.
- మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్