Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ-మల్హర్రావు
తెలంగాణ లో ఇంకా ఎన్నాళ్ళు బలిదానాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పీక కిరణ్, గంట ప్రబనందం అన్నారు. సోమవారం వారు మండలంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి 1200మంది అమరుల తల్లుల గర్భశోకం తీరకముందే నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువులైన ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు నేడు విద్యార్థి , నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారడం అత్యంత విషాదకరమన్నారు. ఉన్నత చదువులు చదివి, డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు ఉద్యోగాలు రాక , ఉపాధి అవకాశాలు లేక, అన్నమోచంద్రశేఖరా అంటూ నేలరాలుతున్నారని అన్నారు. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మురళి ముదిరాజ్ తన హాస్టల్ బాత్రూం గదిలో ఉరివేసుకోని చనిపోగా, డాక్టర్ కొంపల్లి నర్సయ్య మాదిగ కేసీఆర్ పుట్టినరోజు, ఫిబ్రవరి 17న తన హాస్టల్ గదిలోనే పురుగుల మందుతాగి ప్రాణాలలొదిలాడన్నారు. ఇలా ఎంతో మంది తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నేడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి కేసీఆర్ ప్రకటనతో బలవణ్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజల ,నిరుద్యోగుల ఒత్తిడికి తట్టుకోలేక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తమ ఏడేళ్ళ పాలనలో లక్షా ముప్పై వెయ్యిల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారాన్నరు. కానీ, అవన్నీ తప్పుడు లెక్కలేనంటూ, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసిందో శాఖల వారిగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.