Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలు, తేమతో తేవద్దు..
- టోకెన్ పద్ధతి పాటించాలి
- మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
నవతెలంగాణ-వరంగల్
రైతులను ఆదుకోవడానికి రూ.20 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీతో ధాన్యం కొనుగోలు చేయనున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలి పారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోట ల్లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా లకు సంబంధించి ధాన్యం కొనుగోలు, కోవిడ్ 19పై తీసుకుంటున్న చర్యలను సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఆర్ధికపరమైన ఇబ్బందులున్నా రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వానాకాలం కంటే ఈ యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరిగిందని, ఈ మేరకు అధిక దిగుబడులు వచ్చే అవకాశముందన్నారు. దిగుబడులకు తగ్గట్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమన్వయంతో సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ విధానాన్ని పాటించాలని కోరారు. తాలు, తేమ లేకుండా ధాన్యం తీసుకురావాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యం లో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, కరోనా నేప థ్యంలో అందుబాటులో సానిటైజర్లు, మాస్కులుంచాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు మరోసారి శ్రీకారం చుట్టారని తెలి పారు. కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ద్వారా విపరీతంగా సాగు నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఒకవైపు మిషన్ కాకతీయ ద్వారా బాగుపడి చెరువులను నీటితో నింపడంతో రైతులు యాసంగిలోనూ వరి ఎక్కువగా సాగు చేశా రని చెప్పారు. వర్షాకాలం కంటే యాసంగిలోనే అధిక విస్తీర్ణంలో సాగు జరిగి, అధిక దిగుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. గతంలోలాగే ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, ఓడీసీఎంఎస్, డీసీసీబీల ద్వారా కొనుగోలు చేస్తున్నామని వివరించారు. గోదాముల సామర్ధ్యాన్ని పెంచాలని స్పష్టం చేశారు. వెంటనే రైస్ మిల్లర్లతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్, హమాలీల సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గోదాముల్లో నిల్వ సామర్ధ్యం ఉందా ? : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
గతంలో ధాన్యం కొనుగోలు సందర్భంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుర్తు చేశారు. ముఖ్యంగా గోదాముల్లో నిల్వ సామర్ధ్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టంలో ఎక్కడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. గతంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సమస్య తీవ్రంగా ముందుకొచ్చిందని తెలిపారు. గన్నీ బ్యాగులు లేక రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. లారీ లోడ్ మిల్లుకు చేరాక అన్లోడ్ చేయడంలోనూ తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గోదాముల్లో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయడానికి స్థలముందా ? లేదా పరిశీలించాలని అధికారులను కోరారు. మిల్లర్లు గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఐకెపి కొనుగోలు కేంద్రం వద్ద ఎండాకాలమైనందునా చలివేంద్రాలతోపాటు టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్, మే మాసాల్లో వడగండ్ల వర్షాలు ప్రతియేటా వస్తున్నాయని, ధాన్యం తడవకుండా అవసరమైతే టార్పలిన్ షీట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
వడగండ్ల వర్షాలపై అప్రమత్తత అవసరం : ఎమ్మెల్యే పెద్ది
ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో ధాన్యం కొనుగోలు సందర్భంలో వడగండ్ల వర్షాలు కురవడం వల్ల తీవ్ర నష్టాలను రైతులు చవిచూస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మునుప్నెడూ లేనివిధంగా ఎండాకాలంలో వరి సాగు పెరిగిందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి తక్కువ రోజుల్లో ఎక్కువ కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా సమస్య కూడా ముందుకు వచ్చే అవకాశముందని చెప్పారు. భారీ వాహనాల కొనుగోలు సంఖ్య తగ్గిందన్నారు. రవాణాకు సంబంధించి టెండర్లు తీసుకున్న ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఏఏ వాహనాలు అందుబాటులో వున్నాయో పరిశీలించాలని కోరారు. గత పదేండ్లలో ఏడేండ్లు వడగండ్ల వర్షాలు కురియడంతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జిల్లాలో గోదాముల్లో నిల్వ సామర్ధ్యాన్ని పరిశీలించాలని సూచించారు.
తాలు, తేమపై రైతుల్లో అవగాహన పెంచాలి : మార్నేని రవీందర్రావు, డీసీసీబీ చైర్మెన్
కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంలో తాలు, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకునేలా రైతుల్లో అవగాహన పెంచాలని డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్రావు తెలిపారు. గతంలో రూ.7 వేల కోట్లు నష్టం వచ్చినా సీఎం కేసీఆర్ ఈసారి ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవసరమైతే సిబ్బందిని పెంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం రవాణకు ట్రాక్టర్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని మహాజన సభలో రైతులు అడిగారని, ఇందుకు అనుమతినివ్వాలని కోరారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో గన్నీ బ్యాగ్‌లకు సంబంధించి రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కలెక్టర్లను కోరారు. నాబార్డ్ 44 సంఘాలకు గోదాములను నిర్మించుకోవడానికి రూ.2 కోట్ల మేరకు రుణమివ్వడానికి అంగీకారం తెలిపిందని చెప్పారు. తొలుత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతోత్సవాలను పురస్కరించుకొని ఆయన ఛాయాచిత్రానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సమావేశంలో వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మెన్ డాక్టర్ సుధీర్‌కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, ఓడీసీఎంఎస్ చైర్మెన్ రామస్వామి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, హరిత, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.