Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం జీడబ్లూఎంసీ ఎంసి పరిధిలోని 66 డివిజన్లలో సర్వే జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది వరంగల్‌లోని ఎస్ఎస్ఆర్ తోట, కరిమాబాద్‌లో సిబ్బంది నిర్వహిస్తున్న ఓటర్ల సర్వే తీరును పరిశీలించి సమర్ధవంతంగా సర్వే చేయుటకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రతి ఇంటికి తూచా తప్పకుండా ఓటర్ల సర్వే చేయాలన్నారు. బల్దియా సిబ్బందికి తోడుగా రెవెన్యూ శాఖ వీఆర్ఓ లను కూడా నియమించినందున సమ న్వయంతో వేగవంతంగా సర్వే చేయాలని సూచించారు. ఈ సర్వే ఎట్టిపరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం లోగా పూర్తి కావాలని, అందుకు రాత్రి వరకు సర్వే జరి గేలా సర్కిల్ ల వారీగా ఉప కమిషనర్ లు అనునిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదనపు కమిషనర్ నాగేశ్వర్, కాశిబుగ్గ, కాజిపేట్ సర్కిల్ కార్యాలయాల ఉప కమిషనర్లు జానా, రవీందర్ యాదవ్‌లు కూడా వారి వారి డివిజన్లలో బల్దియా ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఓటర్ల సర్వే తీరును పరిశీలించారు. ఈ సర్వేలో బల్దియా రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వి ఆర్ఓలు, చైన్ మెన్లు తదితరులు పాల్గొన్నారు.