Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేలవాలిన మొక్కజొన్న, వరి పంట
నవతెలంగాణ-బయ్యారం
అకాల గాలి దుమారంతో కూడిన వర్షానికి మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీ పంట సాగులో మండలంలో సాగులో ఉన్న మొక్కజొన్న, వరి, మిర్చి మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి కాయలు నేలరాలి, మొక్కజొన్న, వరి పంటలు నేలమట్టమయ్యాయి. సుమారు 50 ఎకరాల్లో రైతులు నష్టపోయినట్టు తెలుస్తోంది. మండలంలోని బాలాజీపేట గ్రామంలోని మామిడి, వరి, మొక్కజొన్న రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయారు. ఆ గ్రామ సర్పంచ్ జగన్ మాట్లాడుతూ గ్రామంలోని రైతులు తోకల వెంకన్న, కోడి శ్రీను, సురబాయిన సత్యం, దరవత్ రవి, రైతుల పంటలు పూర్తిగా నేల మట్టమయ్యాయని తెలిపారు. ఆరుకాలం కష్టపడి పెట్టుబడి పెట్టి పండిచిన పంట ఒక్కసారిగా రైతుల బతుకులు అయోమయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటను తక్షణమే మండల అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్ పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు. గౌరారంలో ఇంటి పైకప్పులు లేచిపోయాయి.కస్తూరినగరం గ్రామంలో గాలివాన వల్ల సుమారు 50 ఎకరాల్లో మామిడికాయలు రాలిపోయాయి. సంబంధిత అధికారులు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. నష్టపోయిన పంటలను ఆయన ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రామచంద్రుల మురళి, తోకల వెంకన్న, కొత్త రామదాసు, ఎర్రమళ్ల వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన వరి పంట పరిశీలన
అకాల గాలిదుమారం వల్ల మండలంలో నష్టపోయిన వరి పంటను ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏఓ బానోతు రాంజీ నాయక్ పరిశీలించారు. మండలంలోని వెంకట్రాంపురం, జగ్నాతండా గ్రామంలో రైతులు సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.