Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మెన్ ప్రభంజన్ యాదవ్, గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, రాష్ట్ర గౌరవ సలహాదారు కాసాని ఐలయ్య ఆకాంక్షించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరగకుండా గొర్రెల కాపరుల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం కమ్యూనిటీ హాల్లో పయ్యావుల మల్లయ్య, కొమ్మనబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జీఎంపీఎస్ ద్వితీయ జిల్లా మహాసభలు మంగళవారం నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథులుగా ప్రభంజన్ యాదవ్, ఉడుత రవీందర్, ఐలయ్య హాజరై మాట్లాడారు. గ్రామాల్లో గొల్ల కురుమలు చదువుకోకుండా వెనుకబడి ఉన్నారని తెలిపారు. గొల్ల కురుమ కులానికి చెందిన పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని సూచించారు. తద్వారా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ప్రభుత్వం హామీ గొర్రెల పంపిణీ 30 నెలల తర్వాత పోరాటాల ఫలితంగా ఇటీవల ప్రారంభించిందని చెప్పారు. 21 గొర్రెలకు బదులు 11, 12 మాత్రమే ఇస్తూ ప్రభుత్వం మోసగిస్తోందని విమర్శించారు. అలాగే గొల్లకురుమ కులానికి చెందిన నిరుద్యోగ యువతకు రూ.30 లక్షలు చొప్పున సబ్సిడీ రుణమిచ్చి ఆధునిక పద్ధతిలో గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఖాళీగా ఉన్న పశు వైద్య అధికారుల పోస్టులను భర్తీ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్, కార్యదర్శి పరికి మధుకర్, నాయకులు చల్లగొల్ల మల్లయ్య, గండ్రకోటి కుమార్, కేశబోయిన మల్లయ్య, దూదిమెట్ల మోహన్రావు, చిన్నాల కట్టయ్య, కొమ్మనబోయిన యాకయ్య, బొల్లం నర్సయ్య, మహేందర్, ఎర్రం చేరాలు, మహేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.