Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ఎండిపోతున్న పంట పొలాలకు దేవాదుల ద్వారా నీరందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సంఘం అధ్యక్షుడు రాపర్తి సోమన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశానికి కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోవడంతో నష్టపోయారని తెలిపారు. ఎకరం కూడా ఎండనివ్వమని ప్రభుత్వం ఊదరగొట్టినా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. పంటపొలాల్లో పశువులను మేపుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా పంటలు చేతికొస్తున్న తరుణంలో వరికోత యంత్రాల యజమానులు కోతకు అధిక ధరలు నిర్ణయించి రైతులను దోపిడీ చేసే పరిస్థితి ఉందన్నారు. జిల్లా మొత్తం ఒకే విధమైన రేట్లు ఉండేలా వరికోత యంత్రాల యజమానులకు అనుమతులివ్వాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వెంటనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టడంతోపాటు గన్నీబ్యాగుల, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మీట్యానాయక్, గొల్లపల్లి బాపురెడ్డి, సాదం జంపన్న, బీరయ్య, గురజాల లక్ష్మీనర్సింహారెడ్డి, రామచొక్కం, భిక్షపతి, సత్తిరెడ్డి, ఉప్పల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.