Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
శ్రీరామనవమి ఉత్సవాలను ఇండ్లలోనే జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో కోవిడ్-19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. మార్చి 15 నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో మాస్కులు లేకుండా తిరిగినా, సామాజిక దూరం పాటించకపోయినా జరిమానాలు విధించాలని చెప్పారు. పంచాయతీ సిబ్బంది, సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు కోవిడ్-19పై విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. వ్యాపారస్తులు మాస్కు ధరించి లావాదేవీలు నిర్వహించాలని చెప్పారు. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 45 ఏండ్ల వయస్కులైన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఆక్సీజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని, కొరత విషయమై వైద్యాధికారులు నివేదిక అందించాలని తెలిపారు. మున్సిపాల్టీల్లో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ ఫంక్షన్ హాళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి వేడుకలకు సంబంధించి నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైన్స్, బార్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జెడ్పీ సీఈఓ సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు వెంకట్రాములు, డీపీఓ రఘువరన్, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ నిర్మాణ పనుల పరిశీలన
కలెక్టరేట్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కురవి రోడ్డులో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆయన సందర్శించి మాట్లాడారు. తొలుత బ్లాక్‌ల వారీగా పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఈఈ తానేశ్వర్, డిప్యూటీ ఈఈ రాజేందర్, తహసీల్దార్ రంజిత్, తదితరులున్నారు.