Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
దండకారణ్య అటవీ ప్రాంతంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించనున్నాయి. బలగాలను మట్టుపెడుతూ సర్కారుకు సవాల్ విసురుతున్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం, సిలిగేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ లక్ష్యంతోనే కూంబింగ్ దళాలపై దాడికి తెగబడ్డారు. ప్యూహత్మక ప్రదేశాల్లో మాటువేసి కూంబింగ్‌లో ఉన్న జవాన్లపై మూడు వైపుల నుంచి చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మావోయిస్టులు చెట్లపై నుంచి ముళ్ల పొదల్లోంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందగా 31 మంది జవాన్లు గాయపడ్డట్టు అధికారులు నిర్ధారించారు. బీజాపూర్ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్ జరిగినా కూడా కేంద్ర బలగాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రతికారం తీర్చుకోవాలనే దృఢమైన సంకల్పంతో ఇప్పటికే భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులు సైతం వెనుకడుగు వేయటం లేదు. పోలీసులు, పారా మిలిటరీ దాళాలు వస్తే మూల్యం తప్పదంటూ బీజీపూర్లో జరిగిన ఘటనలో జమ్ము కాశ్మీర్‌కు చెందిన జవాన్‌ను బందీగా పట్టుకున్నామంటూ ఆపరేషన్ ప్రహర్లో పాల్గొన వద్దంటూ ఛత్తీస్‌ఘడ్ పోలీసులకు మావోయిస్టు పార్టీ దక్షిణ భారత్ సబ్‌జోనల్ కమిటీ ఓ ప్రకటనలో కోరింది.
అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు
ఛత్తీస్‌ఘడ్‌లో మెరుపు వేగంతో బలగా లను మట్టుబెట్టిన మావోయిస్టులు సమీపంలోని తెలంగాణ, ఆంధ్రా, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాం తాలకు వెళ్లి తలదాచుకునే అవకాశాలు ఉన్నా యనే చత్తీస్ఘడ్ రాష్ట్ర సూచనలు, కేంద్ర హోం శాఖ హెచ్చరికల మేరకు తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహక జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక నిఘా పెట్టారు. ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఏటూరునాగారం, పరిసర గిరిజన గ్రామాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని అవగాహన కల్పిస్తున్నారు. వెంకటాపురం సర్కిల్ సీఐ కాగితోజు శివప్రసాద్ ఆధ్వర్యంలో పేరూరు, వాజేడు, వెంకటాపురం ఎస్సైలు హరికృష్ణ, రఘుపతి, తిరుపతి జాతీయ రహదారులపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల దృవపత్రాలు పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు. సరిహద్దు గిరిజన గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు సానుభూతిపరులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఏజన్సీ ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.