Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముం దని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈనెల 10న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నగర పర్యటన ఖరారైనట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ పర్యటన ఏడాదిగా పలుమార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించ నున్నారు. ఈ పర్యటనలోనే 'కుడా' మాస్టర్‌ప్లాన్ కు ఆమోదముద్ర వేసే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉంటే గ్రేటర్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కలెక్టర్‌ను స్పెషలాఫీసర్‌గా నియమించారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. ప్రస్తుతం డివిజన్ల వారీగా కులాల పరంగా ఓటర్ల గణన జరుగుతోంది. ఇది పూర్తి కాగానే డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో ఈనెల రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 30న పోలింగ్ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రెండు, మూడ్రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నగర పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, మరికొన్నింటికీ శంకుస్థాపన చేయనున్నారు.
10న మంత్రి కేటీఆర్ రాక..?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రెండో వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో అంతకుముందే ఈనెల 10న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. అనేక మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈనెల 10న వరంగల్‌కు రానున్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పలు స్మార్ట్ సిటీ రోడ్లను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, స్మార్ట్ రోడ్లను ప్రారంభిస్తారు. నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రాంపూర్ అర్భన్ పార్క్, శిల్పారామం, నగరానికి నలువైపులా కాకతీయ కీర్తి తోరణాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసే అవకాశముంది. 13 కిలోమీటర్ల మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డును రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాల్సి వుంది. ఈ పనులకు మంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇందులో భూసేకరణకే రూ.200 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ పనులన్నీ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వస్తేనే ప్రారంభమయ్యే అవకాశముంది. ఏడాదిగా మంత్రి పర్యటనలు ఖరారైనా చివరి నిమిషంలో వాయిదా పడుతూ ఇప్పటికీ మంత్రి రాకపోవడంతో అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులు ప్రారంభం కాలేదు.
త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల ..?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల రెండో వారంలో విడుదల చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన పూర్తి చేశారు. గతంలో 58 డివిజన్లుండగా, పునర్విభజనతో 66 డివిజన్లకు పెరిగాయి. ప్రస్తుతం డివిజన్ల వారీగా కులాలవారీగా ఓటర్ల గణన జరుగుతుంది. ఇది పూర్తికాగానే డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు అధికంగా వున్నట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ ఉంటుందన్న ప్రచారం ముమ్మరవడంతో ఆశావహులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆశావహులు సేఫ్ డివిజన్లను ఎంచుకొని ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశముంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్‌కు ముందే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. దీంతో రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. మంత్రి కేటీఆర్ పర్యటన అనంతరం అన్ని రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం లేకపోలేదు.