Authorization
Mon March 24, 2025 12:27:14 am
- తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించి తదనంతరం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా ఇక్కరికి కూడా కట్టించలేదని విమర్శించారు. అనేక మంది పేదలు దశాబ్దాలుగా అద్దె ఇండ్లలో నివాసముంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని చెప్పారు. ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే పేదలు ఎక్కడ తలదాచుకుంటారని ప్రశ్నించారు. మరోవైపు పట్టణంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణ కు గురౌతుండగా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. నెక్కొండ రోడ్డులోని కాకతీయ నగర్ పక్కన 601 సర్వే నెంబర్లోని 5.33 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు. కొందరికి అసైన్ చేయగా మిగిలిన 2.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు సాగు చేస్తూ, ఇటీవల వెంచర్ చేసి ప్లాట్లను విక్రయిస్తుంటే పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసి అడ్డుకున్నట్టు తెలిపారు. ఎకరం ప్రభుత్వ భూమిని రికార్డుల్లో చూపించకుండా సర్వేయర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సదరు స్థలాన్ని పేదలకు పంచాలని కోరారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, అనంతగిరి రవి, పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, నాయకులు గుజ్జుల వెంకన్న, గడ్డమీది బాలకృష్ణ, హన్మకొండ సంజీవ, గుజ్జుల ఉమ, కందికట్ల వీరేష్, రాజు, మొగులోజు శారద, హుస్సేన్, రవి, తదితరులు పాల్గొన్నారు.