Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు.. లేదంటే తిరస్కరణ
- ధాన్యం కొనుగోలుకు 105 కేంద్రాలు
- 'నవతెలంగాణ'తో అడిషనల్ కలెక్టర్ జి సంధ్యారాణి
నవతెలంగాణ-వరంగల్
తాలు లేకుండా ధాన్యం తెస్తేనే కొనుగోలు చేస్తామని, లేదంటే కొనుగోలు చేయమని వరంగల్ అర్భన్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి స్పష్టం చేశారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 105 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్ 15 తరువాత ఈ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. తాలుతోనే ధాన్యం తీసుకొస్తే కొనుగోలు చేయమని రైతులు ఈ విషయం గమనించాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో రైతులు విధిగా మాస్క్లు ధరించాలని కోరారు. ఎండాకాలమైనందునా, కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, చలివేంద్రాలు, ఓఆర్ఎస్ పాకెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై 'నవతెలంగాణ'కు అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి వివరించారు.
నవతెలంగాణ : వరంగల్ అర్భన్ జిల్లాలో ఈసారి ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ?
అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి : జిల్లాలో 105 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 68 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలవి కాగా, 35 ఐకెపి కేంద్రాలున్నాయి. గత ఏడాది 92 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈసారి అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు.
న.తె : కొనుగోలు కేంద్రాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారు ?
అడిషనల్ కలెక్టర్ : జిల్లాలో ముందుగా కమలాపూర్ మండలంలో తొలుత వరి కోతకు వస్తుందని, అందుకు కమలాపూర్ మండలంలో ఏప్రిల్ 15 తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. మిగతా మండలాల్లో మే మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి.
న.తె : ఎంత మేరకు ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశముంది. అందులో ఎంత కొనుగోలు చేస్తారు ?
అడిషనల్ కలెక్టర్ : రబీలో జిల్లాలో 1 లక్షా 5 వేల ఎకరాలలో వరి సాగు చేశారని, ఇందులో 2.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయడం జరిగిందన్నారు. ఇందులో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
న.తె : రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటి ?
అడిషనల్ కలెక్టర్ : గత ఏడాది ధాన్యాన్ని తాలుతోనే రైతులు తీసుకురావడంతో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినా మిల్లర్లు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో అన్లోడింగ్లో తీవ్ర జాప్యం జరిగి లారీలు ఖాళీ కాక కొనుగోలు కేంద్రాల్లో రోజులతరబడి రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో తాలుతో ధాన్యం తీసుకువస్తే కొనుగోలు చేయం. ఈ విషయాన్ని రైతులు గమనించాలి. 17 శాతం కంటే ఎక్కువ తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యాన్ని మంచిగా తూర్పాల పట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి.
న.తె : గతేడాది రబీలో ధాన్యం తరలింపునకు వాహనాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి కదా ?
అడిషనల్ కలెక్టర్ : ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. టెండర్లు పిలిచి 4 ఏజెన్సీలను ఇప్పటికే ఫైనల్ చేయడం జరిగింది. అవసరమైతే మరిన్ని వాహనాలు సమకూర్చుకోవడానికి సిద్ధంగా వున్నాం.
న.తె : గన్నీబ్యాగ్ల కొరత.. ఇబ్బందులపై మీ చర్యలు ?
అడిషనల్ కలెక్టర్ : జిల్లాలో 15 లక్షల గన్నీబ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరో 10 లక్షల గన్నీబ్యాగులు కావాలని ఆర్డర్ పెట్టాం. ఈసారి గన్నీబ్యాగుల ఇబ్బందులుండవు.
న.తె : ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాములున్నాయా ?
అడిషనల్ కలెక్టర్ : మిల్లర్లకు సంబంధించిన గోదాములే కాకుండా ప్రైవేటు గోదాములను గుర్తిస్తున్నామన్నారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు సంబంధించిన గోదాములను కూడా ధాన్యం నిల్వ కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గోదాముల సమస్య రాదని, వచ్చిన ధాన్యం వచ్చినట్లు కస్టమ్స్ మిల్లింగ్ అయి తరలిపోతుంటుంది.
న.తె : రైతులకు ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇస్తారు ?
అడిషనల్ కలెక్టర్ : వారం రోజుల్లో రైతులకు సంబంధించిన బ్యాంక్ అక్కౌంట్లలో జమ అవుతుంది.
న.తె : గతేడాది వడగండ్లతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు .. ఇందుకు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ?
అడిషనల్ కలెక్టర్ : ప్రతి కొనుగోలు కేంద్రంలో 20 నుండి 25 టార్పలిన్లు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
న.తె : ఒకవైపు వేసవి, మరోవైపు కోవిడ్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ?
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి : కొనుగోలు కేంద్రాల్లో నీడనిచ్చే విధంగా టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు మాస్క్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు రావద్దన్నారు. శానిటైజర్లు, ఓఆర్ఎస్ పాకెట్లను కూడా కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి కూడా ఆదేశాలిచ్చాం.