Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మూడురోజుల ముందే..22మంది జవాన్లు హతం
- మావోయిస్టుల ఉచ్చులో భారీ నష్టం
- 5 యాక్షన్ టీమ్‌ల కోసం గోదావరి లోయలో భారీ కూంబింగ్
నవతెలంగాణ-వరంగల్
సరిగ్గా పదేండ్ల కిందట 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా చింతల్ నార్ వద్ద మావోయిస్టుల పేల్చివేతలో 76 మంది సీిఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. ఈ ఏడాది ఏప్రిల్ 6కు మూడురోజుల ముందు ఏప్రిల్ 3న మావోయిస్టుల ఉచ్చులో ఇరుకున్న కోబ్రాలు 22మంది మృత్యువాతపడ్డారు. పదిరోజుల క్రితం మావోయిస్టుల యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రం నుంచి మూడు భారీ వాహనాల్లో పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని ఐదు ప్రాంతాల నుంచి 2 వేలమంది భద్రతా దళాలైన కోబ్రాలు, డీఆర్జి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. హిడ్మాను లక్ష్యంగా చేసుకొని సమీప అడవుల్లో వున్నాడన్న సమాచారంతో పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ఏప్రిల్ 2న రాత్రి జోనగూడ సమీపంలో హిడ్మా వున్నాడన్న సమాచారంతో భద్రతా దళాలు ముందుకు దూసుపోయాయి. 3న ఉదయం భద్రతా దళాలను మావోయిస్టులు చుట్టుముట్టాయి. 5-6 గంటలపాటు జరిగిన భీకర పోరులో 22 మంది కోబ్రాలు మృతిచెందగా, ఒక జవాన్ మావోయిస్టులకు బందీగా చిక్కాడు. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని దండకారణ్యం నుండి 5 మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకొని రంగంలోకి దిగుతున్నాయని భావించి పది రోజులుగా గోదావరి లోయలో భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులను సైతం పోలీసు ఉన్నతాధి కారులు అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో ఏప్రిల్ 3న భారీ దాడిలో 22 మంది కోబ్రాలు మృతిచెందడంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో గుత్తికోయల గూడెల్లో, ఏజెన్సీ పల్లెల్లో భద్రతా దళాలు కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండల కేంద్రంలోనూ ఇల్లిల్లు తనిఖీ చేయడం గమనార్హం. పదిరోజుల క్రితం కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా దళాలు అటవీ ప్రాంతం నుండి బయటకు రాలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.
మావోయిస్టులపై దాడులకు కేంద్ర బలగాలు
మావోయిస్టులను అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను సమన్వయపరిచి పలు సందర్భాల్లో సమావేశాలను నిర్వహించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి పలు సందర్భాల్లో గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయడమే కాకుండా, గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, మహాముత్తారం పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ కూంబింగ్
గోదావరి పరివాహక ప్రాంతం ఇవతలి పక్కన తెలంగాణ రాష్ట్రం సరిహద్దులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను రంగంలోకి దించాయి. తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు జిల్లా సరిహద్దుల్లో గోదావరి నదికి అవతల చత్తీస్‌గఢ్ రాష్ట్రం వుండడంతో అక్కడ జరిగిన దాడి నేపథ్యంలో మావోయిస్టులు గోదావరి దాటి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భావించిన రాష్ట్ర భద్రతా దళాలు గత ఐదు రోజులుగా అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. భూపాపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, మహాముత్తారం, కాటారం, పలిమెల, ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాల్లో అటవీ గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారు. గుత్తికోయ గూడెలలో ఇల్లిల్లు సోదా చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లోనూ వాహన తనిఖీ చేపట్టారు.
పదేళ్ల క్రితం 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా చింతల్నార్ వద్ద మావో యిస్టులపై దాడి చేయడానికి వచ్చిన వాహనాలను పేల్చడంతో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతిచెందారు. దేశంలోనే ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా జోనగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎరకు చిక్కిన కోబ్రాలు 22 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీన బస్సు పేల్చివేయగా 3గ్గురు జవాన్లు మృతి చెందారు. గతేడాది మార్చి 21వ తేదీన సుకుమా జిల్లాలో మావోయిస్టులు జవాన్ల వాహనాన్ని పేల్చివేయడంతో 17 మంది జవాన్లు మృతిచెందారు. ఇందులో 12 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు కావడం గమనార్హం. 2017 ఏప్రిల్ 24వ తేదీన చింతగుఫా బుర్కపాల్‌లో జరిగిన కాల్పుల్లో 24 మంది సీిఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.