Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీలు అమల్జేయకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం
- ఉగాది తరువాత డేంజర్ జోన్ నిర్ధారిస్తాం : ఆర్డీఓ శ్రీనివాస్
నవతెలంగాణ-మల్హర్రావు
టీఎస్ జెన్కో అధికారులు తమను నమ్మించి నట్టేట ముంచారని తాడిచర్ల, కాపురం గ్రామాల భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తాడిచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ, జెన్కో అధికారులు భూ నిర్వాసితులతో స్థానిక సర్పంచ్ సత్యనారాయణ అధ్యక్షతన పలు సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడారు. నిర్వా సితుల ప్రతి సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తామనడంతో ఒకేసారి స్థానిక ఎంపీటీసీ-1 సభ్యురాలు రావుల కల్పన మొగిలి, పలువురు భూ నిర్వాసితులు మూకుమ్మడిగా అధికారులపై మండి పడ్డారు. పదకొండేండ్లుగా డేంజర్ జోన్ పేరిట మరుగుదొడ్లు, డ్రయినేజీలు, ప్రభుత్వ పథకాలు అందక పలు సమస్యలతో నరకయాతన అనుభవి స్తున్నామని కన్నీరుమున్నీరయ్యారు. తమను ఉగ్రవా దుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. 2008లో ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తమను జెన్కో, రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిక్వైజేషన్పై రెవెన్యూ అధికారులకు జెన్కో అధికా రులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏపీ జెన్కో పేరిట పదేళ్ల క్రితం 1300 గృహాలను తీసుకుంటాని ఇండ్లకు నెంబర్లు వేసారని అన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేలు నిర్వహించి పరిహారం ఇవ్వకుండా పదకొండేండ్లుగా తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు 1315 ఉద్యోగాలు జెన్కోలో ఇస్తామని నామమాత్రంగా ఏఎమ్మార్ కంపెనీలో 30 శాతం మాత్రమే స్థానికులకు ఉపాధి కల్పించి ,70 శాతం స్థానికేతరులకు ఉద్యోగాలు ఇచ్ఛి అన్యాయం చేశారన్నారు. 2007లో 2300 ఎకరాల భూమి, 1300 గృహాలు సేకరించి 2008 లో ఎల్డీసీ జీవో 98 ప్రకారం జెన్కోలో ఉపాధి కల్పిస్తామని నేటికీ అమలు చేయలుదన్నారు. అధికారులు హమీ ఇచ్చిన కొద్ది రోజుల్లోపే జీఓ-68 ప్రకారం తాడిచర్ల భూ నిర్వాసితులకు సాధ్యం కాదన్న ఇదే జెన్కో అధికారులు కాళేశ్వరం, కాటారం ఖమ్మం లోని సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో భూములు కోల్పోయిన వారికి ఉపాధి ఎలా కల్పించారని ప్రశ్నించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తామంటున్నా.. అధికార యంత్రాంగం మారినప్పుడల్లా తమ గోడు మరుగున పడుతోందన్నారు. పన్నెండు సంవత్స రాలుగా జెన్కో అధికారులకు బొగ్గు తవ్వకాలకు సహకరిస్తూనే వస్తున్నామని అన్నారు. నిత్యం ఓసీపీలో బాంబు బ్లాస్ట్ంగ్ వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రలేని రాత్రిళ్ళు గడుపుతున్నామని వాపోయారు. బాంబు దెబ్బలకు ఇండ్లు బీటలు భారీ దుమ్ము ధూళి ఇండ్లలోకి చేరి పలువురు మత్యువాత పడగా మరి కొందరు అనారోగ్యానికి గురయ్యారని అన్నారు. ఇప్పటికైనా జెన్కో, రెవెన్యూ అధికారులు పట్టించుకుని డేంజర్ జోన్ 500 మీటర్లలో ఉన్న గృహాలను, మిగులు భూములను, యువతకు ఉద్యోగాలు, కాపురం, ఎస్సీ కాలనీలో పరిహారం ఇచ్చిన ఇండ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరా వాసం కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలించాల న్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఉగాది తర్వాత డేంజర్ జోన్ నిర్ధారించి భూ సేకరణ ప్రారంభి స్తామని తెలిపారు. ప్రతి భూ నిర్వాసితునికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 359 ఎకరాల భూ సేకరణతో పాటు సీఎస్పీలో 500 ఉద్యోగాలు అర్హతను బట్టి యువతకు ఉపాధి కల్పించేందుకు చొరవ తీసుకుంటామని అన్నారు. ఇందుకు బొగ్గు తవ్వకాలకు నిర్వాసితులు సహకరించాలని జెన్కో అధికారులు కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీసు పహారాలో సమావేశం కొనసాగడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు రావల కల్పన మొగిలి, తహసీల్దార్ శ్రీనివాస్, జెన్కో అధికారులు, కాటారం సీఐ హాతీరాం, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్, సభ్యులు అక్కపాక సమ్మయ్య, బండి రాజయ్య, కోట రవి, బూడిద మల్లేష్, రామిడి గట్టయ్య, సమ్మయ్య, లక్ష్మయ్యతొనాటె భూ నిర్వా సితులు వెయ్యిమంది పాల్గొన్నారు.