Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా వ్యాప్తంగా 200 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. శుక్రవారం జేసీ కూరాకుల స్వర్ణలత, డీఆర్డీఓ పురుషోత్తం, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాఘవేందర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌తో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయవిస్తరణ అధికారులు, తదితర మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఈ నెల మూడవ వారంలో జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల వారీగా ఆయాకేంద్రాలకు కేటాయించిన రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేసి కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్యాడి క్లీనర్లు, టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా శానిటైజర్లు, తాగునీరు, తదితర వసతులు కల్పించాలన్నారు. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో విధులు నిర్వహించే అన్ని స్థాయిల అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతు కల్లాల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ నిధులు ఉపయోగించుకోవాలన్నారు.