Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబటిపల్లి, కాళేశ్వరం పరిధిలో ముగ్గురికి పాజిటివ్
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అంబటిపల్లి, కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఇన్చార్జి వైద్యాధికారి రామారావు సూచించారు. శుక్రవారం అంబటి పల్లి, కాళేశ్వరం పీహెచ్సీ పరిధిలో 87 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, మహాదేవపూర్ ప్రభుత్వా స్పత్రిలో 45 ఏండ్లు పైబడిన వారికి ప్రతి రోజు కరోనా టీకాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవ కాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అందరూ మాస్కులు ధరించి వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలన్నారు.
క్వారంటైన్ సెంటర్ కోసం పరిశీలన
మహదేవపూర్ మండలంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బాధితులను క్వారంటైన్లో ఉంచేందుకు కాళేశ్వరం లోని గిరిజన ఆశ్రమ హాస్టల్‌ను శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై నరహరి పరిశీలించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. గతంలో హరిత హోటల్‌ను క్వారెంటైన్‌గా వినియోగించగా నేడు గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎంపిక చేయడానికి పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.
సూరారంలో ప్రజలకు అవగాహన
సూరారం గ్రామంలో శుక్రవారం మహాదేవపూర్ ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కరోనా పట్ల అవగాహన కల్పించారు. అందరూ మాస్కులు ధరించి, వ్యక్తిగత, గ్రామ పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఇక్కడి ప్రాంతానికి అధికశాతం కూలీలు మహారాష్ట్ర నుంచి రావడంతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సర్పంచ్ నాగలక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ మడక తిరుమల, నాయకులు ప్రతాప్‌రెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
153మందికి కరోనా టీకాలు
రేగొండ : కొడవటంచ గ్రామంలో రేగొండ పీహెచ్సీ వైద్యాధికారిణి మమతాదేవి, గ్రామ సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం 112 మందికి కోవిడ్- 19 టీకాలు వేశారు. ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్రావు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాగే మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో 41 మందికి టీకాలు వేశారు. మొత్తంగా 153 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు వైద్యాధికారి తెలిపారు. ప్రజలు అలసత్వం వహించకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాలన్నారు. ఎంపీడీఓ సురేందర్, ఆలయ చైర్మెన్ మహేందర్, ఆలయ ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అవగాహన తప్పనిసరి : ఎంపీడీఓ
గణపురం : కరోనా పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఎంపీడీఓ అరుంధతి అన్నారు. శుక్రవారం మండలంలోని కర్కపెల్లి గ్రామంలో సర్పంచ్ పొట్ల నగేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సెకండ్ వేవ్ దావనంలా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలన్నారు.
రూ.వెయ్యి జరిమానా
మాస్కు ధరించని వారికి మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మదుసూదన్‌రావు, కార్యదర్శి హరిశ్చంద్రారెడ్డి శుక్రవారం రూ.వెయ్యి జరిమానా విధించారు. కరోనాను అరికట్టేందుకు ఫైన్ వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.