Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'టీఈ' పోల్ మహత్యం
- కుల గణనలో లోపాలు
- రిజర్వేషన్లలో గందరగోళం..
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో గందరగోళం నెలకొంది. 5, 6, 7వ తేదీల్లో బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో విచారణ చేసిన అనంతరం ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లిన విషయాన్ని రాజకీయ పార్టీలు ఎండగట్టాయి. రెడ్డిలను బీసీలుగా చూపించగా ఒక డివి జన్‌లో ఎస్టీ ఓటర్లు లేకున్నా ఉన్నట్లుగా చూపించారు. దీంతో డివి జన్ల రిజర్వేషన్లు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడింది. రెండ్రోజులు గా డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైనట్లు జాబితా వాట్సాప్‌ల్లో వైరల్ అవుతుండగా, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనికి అధికారులు కారణం కాదని, 2016 జనవరిలో ఇ-గవర్నెన్స్ 'టీఈ పోల్' అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఓటర్ల జాబితాలు మొదలు అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ సాఫ్ట్వేర్ ఆధారంగానే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ వచ్చాక మొదటిసారి గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 'టీఈ పోల్' నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ల జాబితా లోనే లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లోపాలకు సాఫ్ట్వేర్ కంపెనీ బాధ్యత వహిస్తుందా? లేదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహి స్తుందా ? తేలాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్‌లో 6 లక్షల 52 వేల 952 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 3 లక్షల 22 వేల 847 మంది, మహిళలు 3 లక్షల 29 వేల 929 మంది ఓటర్లుండగా ఇతరులు 176 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు నామమాత్రంగానే విచారణ చేసినట్లు వెల్లడైంది. వెంటనే ఓటర్ల జాబితాలో కులాలకు సంబంధించిన తప్పులను వెంటనే సరిచేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఈ తప్పులకు బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) బాధ్యులని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికలపై రాజకీయ పార్టీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితాలో కులాల వారీగా చూపిన ఓటర్ల విషయంలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వెంటనే తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ నగరంలో 6 లక్షల 52 వేల మంది ఓటర్లున్నారు. వార్డుల డిలిమిటేషన్ అనంతరం ఆయా డివిజన్లలో కులపరంగా వున్న ఓటర్ల వివరాలలో గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడ్డ 66 డివిజన్లలో చనిపోయిన ఓటర్లను తొలగించలేదు. మూడ్రోజుల్లో బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై విచారణ చేయడం సాధ్యమయ్యే పనికాదు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా చేసే పని వల్ల బిఎల్ఓలు, అధికారులు ఈ విషయంలో అభాసుపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల జాబితాలో భారీగా దొర్లిన తప్పులను సరిదిద్దడానికి తక్కువలో తక్కువ కనీసం 15 రోజుల సమయమైనా పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హడావుడి నిర్ణయాలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల రిజర్వేషన్లు తారుమారయ్య ప్రమాదం ఏర్పడింది.
'టీఈ పోల్'తో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో 'టీఈ పోల్' అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియ, ఆన్లైన్ నామినేషన్ల విధానం, పోలింగ్ స్లిప్పులు, అభ్యర్థుల వ్యయ ప్రక్రియ తదితర వివరాలన్నింటినీ ఈ విధానం ద్వారానే చేపడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో తాజా ఓటర్ల జాబితాను 'టీఈ పోల్' నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాను అనుసరించి గతంలో ఉన్న 58 డివిజన్లను 66కు పెంచారు. ఈ తాజా ఓటర్ల జాబితాలో ప్రతి డివిజన్లో ఒక కులానికి చెందిన ఓటర్లను మరో కులంగా చూపించారు. దాదాపు చాలా డివిజన్లలో ఈ తప్పుడు కులాలను పేర్కొనడం ఈ ఎన్నికల్లో గొడవలకు దారితీసే ప్రమాదముంది. సయ్యద్ అని పేరున్నా ముస్లిం ఓటర్లను ఓసీలుగా చూపించాల్సి ఉండగా బీసీలుగా చూపించినట్లు రాజకీయ పార్టీలు అధికారుల దృష్టికి తెర్చాయి. రెడ్డిలను బీసీలుగా చూపించడం, అన్ని పేజీల్లో తప్పులు దొర్లడం గమనార్హం.
ప్రభుత్వ తప్పే..
టీఈ పోల్ సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ల జాబితానే వినియోగిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేయకుండా ఓటర్ల జాబితాలో అన్ని తప్పులే దొర్లాయని రాజకీయ పార్టీలు విమర్శించాయి. పలు డివిజన్లలో రెడ్డి ఓటర్లను బీసీలుగా, ముస్లిం ఓటర్లను బీసీలుగా చూపించడం పట్ల రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక డివిజన్లో ఎస్టీ ఓటర్లు తక్కువుంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. తద్వారా డివిజన్ల రిజర్వేషన్లలో లోపాలు జరిగే అవకాశముంది. టీఈ పోల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఓటర్ల జాబితాపై క్షేత్రస్థాయిలో రాండం విచారణ చేయడానికి బీఎల్ఓలకు మూడ్రోజులే సమయం ఇవ్వగా, అది వారికి సరిపోలేదు. దీంతో చేసేదేమీ లేక నామమాత్రంగా నిర్వహించారు. ఈ లోపాలున్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళితే డివిజన్ రిజర్వేషన్లలో నష్టం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.
కులాలను మార్చేసిన వైనం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో డీలిమిటేషన్ అనం తరం ఏర్పడ్డ పలు డివిజన్లలో రెడ్డి కులస్తులను బీసీలుగా ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. ఒక డివిజన్లో ఎస్టీ కులస్తులు తక్కువుంటే ఎక్కువ ఉన్నట్లు చూపించారు. తద్వారా ఆ డివిజన్ ఎస్టీలకు రిజర్వ్ అయ్యే అవకాశముంది. బ్రాహ్మణులను, వెలమ లను బీసీలుగా చూపించినట్లు రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా ఆధారంగానే అధికా రుల దృష్టికి తీసుకొచ్చాయి. 5వ డివిజన్లో వాస్తవంగా 431 మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఓటరు జాబితాలో మాత్రం అదే డివిజన్లో 1,551 మంది ఎస్టీ ఓటర్లున్నట్లు చూపించారు. దీంతో 5వ డివిజన్ ఎస్టీలకు రిజర్వ్ అయ్యే అవకాశ ముంది. 6వ డివిజన్ ఓటర్లు జాబితా 516 పేజీలుంది, ఇందులో ప్రతి పేజీలో 4-5 రెడ్డిలను బీసీలుగా చూపించారు. 'రెడ్డి' పేరు కనిపించినా, ఓసీలుగా చూపించాల్సి ఉండగా, బీసీలుగా చూపించడం గమనార్హం. 31, 32, 49 డివిజన్లలోనూ రెడ్డిలను బీసీలుగా చూపించారు. దీంతో డివిజన్ల రిజర్వేషన్లు గందరగోళంగా మారే ప్రమాద ముంది. 53వ డివిజన్లో మహిళా ఓటర్ల సంఖ్యను అధికంగా చూపించారు. 7వ డివిజన్లో 700 డూప్లికేట్ ఓటర్లను నమోదు చేశారని బీజేపీ నేతలు తెలిపారు. ఒకే ఇంటినెంబర్‌పై 60-70 మంది ఓటర్లను నమోదు చేశారు. 49వ డివిజన్లో ఓటర్ల జాబితాలో ఓటర్లను సీరియల్‌గా చూపించలేదు. ఓటర్లను జంబ్లింగ్ చేయడంతో ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయడం కష్టం. 29వ డివిజన్లో రామన్నపేట ప్రాంతంలో గతంలో కమ్యూనిటీ హాలులో పోలింగ్ స్టేషన్ ఉండగా, ఈసారి కాకతీయ టాకీసు వద్ద పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. రామన్నపేట కమ్యూనిటీ హాలులోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.