Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలకు నిలయాలుగా పల్లెలు
- ఐక్యఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
బందు సాయిలు
నవతెలంగాణ-చిట్యాల
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మండుటెండలోనూ జోరుగా ముందుకు సాగుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు నాయకత్వంలో చేపట్టిన పాదయాత్ర ఇప్పటివరకు సుమారు 200 కిలోమీటర్ల మేరకు సాగింది. జిల్లాలోని చిట్యాల మండలానికి పాదయాత్ర శుక్రవారం చేరుకోగా కొత్తపల్లి (ఎస్ఎం), దూత్పల్లి, ఒడితల కొత్త పేట, జడల్పేట, గాంధీనగర్, నైన్పాక, చైన్ పాక, అందుకుతండా మీదుగా సాగింది. ప్రజలు ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి, రోడ్లు, డ్రెయినేజీ, ఇతర సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పాద యాత్ర రథసారథి, పార్టీ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. పల్లెలన్నీ సమస్యలకు నిలయాలుగా తయారయ్యాయని ఆందోళన వెలిబుచ్చారు. స్వరాష్ట్రం సిద్ధించినా పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. వేసవి నేపథ్యంలో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా రని చెప్పారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫల మయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని
చెప్పారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తుందని పేదలు, భూపంపిణీ జరుగుతుందని దళితులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అరకొరగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి పూర్తి చేయించాల్సిన బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు. కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు వెంటనే మంజూరీ చేయాలన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు వెంటనే పట్టాలిచ్చి రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాల్సి ఉందని చెప్పారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పేద లను, కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఒక్కో కుటుంబానికి కరువు పని కింద 200 రోజులు పని కల్పించి రూ.600లు చొప్పున కూలి ఇవ్వాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను, స్కావెంజర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, డప్పు, చెప్పు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులిచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐక్యపోరాటాలతోనే సమస్యలు పరిష్కార మౌతాయని స్పష్టం చేశారు. ప్రజలు ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలతో మమేకమౌతూ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార దిశగా ప్రజాపోరాటాలు నిర్మించాలని దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు పొలం రాజేందర్, గుర్రం దేవేందర్, పసుల వినరుకుమార్, నాగుల అరవింద్, దామెర కిరణ్, ఆత్కూరి శ్రీకాంత్, సూదుల శంకర్, సీఐటీయూ జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, రమేష్, గోపీ, దామెర నరేష్, తదితరులు పాల్గొన్నారు.