Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్దకశాఖ, బ్రోకర్ల చేతిలో రాయితీ గొర్రెల చేతివాటం
- దిగుమతి చేసిన వ్యానులోనే ఎగుమతులకు ఏర్పాట్లు
- పోలీసుల రెక్కీలో వెలుగు చూసిన వైనం
- మాట మార్చిన అధికారులు, లబ్దిదారులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు మారుతాయనే నమ్మకం ప్రజల్లో రోజురోజుకు సన్నగిల్లుతోంది. నీళ్ళు, నిధులు, నియామకాల ఆశ కలలుగానే మిగిలిపోయాయి. ఉద్యమ పార్టీగా పేరు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదవుల బతుకులు ఆగమాగమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ గొర్రెల పంపిణీ పేరుతో పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్రోకర్ల చేతి వాటం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం కాని రాష్ట్రంలో గొర్రెల కొనుగోలు పేరుతో లబ్దిదారుల ఉసురు పోసు కోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బావుపేట-ఎల్లాపూరు శివారులో పోలీసుల రెక్కీలో లబ్దిదారులు మాట మార్చిన తీరు అక్కడి వారిని నిశ్చేష్టులను చేసింది. వివరాల్లోకి వెళితే బావుపేటకు చెందిన యాదవులకు 127 యూనిట్లు మంజూరి అయ్యాయి. వాటిలో మొదటి విడతగా 60 యూనిట్ల గొర్ల పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పంపిణీ చేసిన యూనిట్లలో ఏ ఒక్క లబ్దిదారుడి వద్ద కూడా గొర్రెలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం బావుపేటకు చెందిన 30 మంది లబ్దిదారులకు రెండవ విడత మరో 30 యూనిట్ల గొర్రెల పంపిణీకి పశుసంవర్దకశాఖ అధికారులు గుంటూరు జిల్లాకు పంపించారు. వారిలో 18 మంది పిడిగురాళ్లకు, మరో 12 మందిని నర్సరావుపేటకు వెళ్లారు. గొర్రెల యూనిట్ల కోసం లబ్దిదారులు పలు గ్రామాలు తిరిగారు. కనీసం వారికి ఆహారం, నీరు ఇచ్చే పరిస్థితులు లేవని అధికారులు కూడా తమ వెంట లేరని బ్రోకర్ల సహాయంతోనే గొర్రెల కొనుగోలుకు నానా యాతనలు పడి కొనుగోలు చేసినట్లు లబ్దిదారులు తెలిపారు. అయితే ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెల చొప్పున పంపిణీ చేయాల్సి ఉండగా అక్కడి బ్రోకర్లు 11 గొర్రెల పంప ిణీకి అంగీకరించినట్లు లబ్దిదారులు చెప్పారు. అది కూడా అక్కడ కొనుగోలు చేసిన గొర్రెలను బావుపేటలో దిగుమతి చేసిన తరువాత ఒక్కో లబ్ది దారులకు 21 గొర్రెలు ఇచ్చినట్లు అధికారులు ఫోటోలు తీసుకొని తిరిగి వాటిని కొనుగోలు చేసిన వారికే రూ.75వేలకు ఇచ్చే విధంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేయించుకున్నట్లు బాదితులు తెలిపారు. రాయితీ గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతూ పశు సంవర్ధక, వ్యవసాయ శాఖ అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కై వాటిని రిసైక్లింగ్ చేస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు, ఎస్సై రవీందర్, ఏఎస్సై సుదర్శ న్‌రెడ్డి, కానిస్టేబుల్ రాంప్రసాద్ దాడులు జరిపారు. పక్కా సమాచారంతో ఎల్లాపూర్ శివారులో రెండు వ్యాన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. మొదటగా లబ్దిదారులు నిజాలను అంగీకరించిన తరువాత పశువైద్యాధికారి వచ్చిన తరువాత మాట మార్చడంతో పోలీసులు అవాక్క య్యారు. ఈ విషయంపై ఎల్కతుర్తి పశువైద్యాధికారి దీపికారెడ్డిని వివరణ కోరగా ప్రతి లబ్దిదారుడికి 21 గొర్రెల చొప్పున పంపిణీకి సిద్దం చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా 60 యూనిట్ల గొర్రెలు కూడా గ్రామంలోకి తీసుకువచ్చి తిరిగి బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేసిన చోటకే పంపించి అధికారులు చేతివాటం ప్రదర్శించి లబ్దిదారులకు ఇవ్వకుండా అన్యాయం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శనివారం తీసుకువచ్చిన గొర్రెలను కూడా లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు రికార్డులు, ఫోటోలు తీసుకొని తిరిగి కొనుగోలు చేసిన వారికే అప్పగించి అధికారులు మోసాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ తీరును ప్రజలు తప్పు పడుతున్నారు, కాని ఉన్నత అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.