Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
అపోహలు అవసరం లేదని.. ప్రతిఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్ కోరారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు డొనుక ఉప్పలయ్య తొలి డోసు తీసుకోగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. 60 ఏండ్లకుపైబడ్డ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏండ్ల మధ్య వయస్కులకు వ్యాక్సీన్ వేస్తున్నట్టు తెలిపారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో రూ.250లు చెల్లించి టీకా వేయించుకోలేని పేదలు ప్రభుత్వ ఆస్పత్రిని వినియోగించుకోవాలని సూచించారు. తొలి డోసు వేసుకున్న అనంతరం 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలని చెప్పారు. రెండో డోసు వేసుకున్న 14 రోజులకు కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి వస్తుందని తెలిపారు. అనంతరం ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య మాట్లాడారు. కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగా టీకా వేసుకుని ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్యాధికారి వేద కిరణ్, అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.