Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎమ్ఎస్ జిల్లా కార్యదర్శి చిర్ర సూరి
నవతెలంగాణ-ఖిలా వరంగల్
రైతాంగం నడ్డివిరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎమ్ఎస్) వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి డిమాండ్ చేశారు. శనివారం శివనగర్‌లో పెంచిన ఎరువుల ధరలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యల ఫలితంగా దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు గిట్లుబాటు ధర కల్పించకుండా ఎరువుల ధరలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1200లుగా ఉన్న డీఏపీ బస్తాను రూ.లు 1900లకు, 1300గా ఉన్న 28-28బస్తాను రూ.లు 1700లకు, 875గా ఉన్న పోటాష్ బస్తాను రూ.లు 1000లుగా పెంచారని విమర్శించారు. ఈ విధంగా ధరలను పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూరి రాజు, మైదం పాణి, పీవీఎల్ నాయకులు సాబినికారి మోహన్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు బీ నరసింహారావు, ముంతాజ్, ఎఐకేఎంఎస్ నాయకులు ఉసిల్ల రాజయ్య, కట్కూరి చిన్నస్వామి, ల్లాదల్ల వెంకటస్వామి, వెంకటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.