Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 నుంచి కొనుగోల్లు..?
- ఏర్పాట్లలో సొసైటీ, ఐకేపీ, జీసీసీ రబీ కోతలు షురూ..
నవతెలంగాణ-మంగపేట
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవ సాయ చట్టాల అమలుకు మద్దతుగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడంతో ప్రతిపక్షాలు రైతులకు మద్దతుగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించా ల్సిందేనంటూ గళమెత్తడంతో కొనుగోళ్లపై సంది గ్ధత నెలకొన్న నేపథ్యంలో రబీలో కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ పంట కోతలు ప్రారంభమవుతుండగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సొసైటీ, ఐకేపీ, జీసీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే సొసైటీ, ఐకేపీ, జీసీసీ అధికారుల నుంచి గన్నీ బ్యాగుల ఇండెంట్ తెప్పించు కున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏజెన్సీ లోని రైతులకుకొంత ఊరట లభించినట్టైంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేస్తూ ధాన్యాన్ని మార్కెట్లలో మాత్రమే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ప్రతిపక్షాలు దాన్యం కొనుగోల్లు చేయకుంటే నిరసనలు తప్పవని హెచ్చరిం చాయి. ఈ నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండడంతో రాష్ట్ర ప్రభుత్వం చివరకు రబీ కొనుగోలుకు చర్యలు తీసుకోవా లంటూ సివిల్ సప్లై అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై, సొసైటీ, జీసీసీ శాఖల అధికారులు మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో యాసంగిలో దాదాపు 10 వేల ఎకరాల్లో సాగైన వరి పంటను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఖరీఫ్‌లో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేయాడానికి
దాదాపుగా 3 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. సివిల్ సప్లై శాఖ నేతత్వంలో సహకార సంఘాలు, ఇందిరా క్రాంతి పధం, గిరిజన కోఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో మంగపేట, తాడ్వాయి మండలాల్లో సుమారు 35కుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొనుగోళ్లపై స్పష్టత రావడంతో ఈనెల 17 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.