Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెవాసులకు అండగా సీపీఐ(ఎం) పోరాటాలు
- కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, సీనియర్ నేత సారంపెల్లి
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్ట ణంలోని కాకతీయ నగర్లోని సర్వే నెంబర్ 601లో ప్రభుత్వ భూమిలో పార్టీ ఆధ్వర్యంలో వేసిన పేదలు గుడిసెలను శనివారం వారు సందర్శించి గుడిసెవాసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నాగయ్య, సారంపల్లి మాట్లాడారు. పట్టణం లో వివిధ సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూము లను ఎక్కడికక్కడ ఆక్రమించుకుంటున్నా ప్రభు త్వం, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక ఏండ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పేదలకు ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, ఏడేండ్లు గడచినా ఒక్కరికీ అమలు చేసిన దాఖలాల్లేవని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు భూకబ్జాదార్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణంలోని సర్వే నెంబర్ 601లో 2.39 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమి ఉండగా రెవెన్యూ అధికార యంత్రాంగం తప్పుడు సర్వే చేసి కేవలం 1.39 ఎకరాలే ఉందని నివేదిక అందించి మరో ఎకరం భూమిని రికార్డుల్లోకి రాకుండా చేయడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించి సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో 3 వేల 500 మంది ఇండ్లు లేని పేదలున్నారని చెప్పారు. కిరాయి ఇంట్లో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. అనేక ఏండ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇండ్ల స్థలాలు క్రమబద్దీకరించేందుకు జారీ చేసిన జివో 58 తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. సర్వే నెంబర్ 204, 813ల్లోని ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. 813 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో చాలా కాలంగా దళితులు సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సదరు భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. పట్టణంలో గుడిసెలు వేసి ప్రభుత్వ భూములను కాపాడిన చరిత్ర సీపీఐ(ఎం)కే దక్కుతుందని చెప్పారు. వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 277 ఎకరాల మిగులు భూమిని వెంటనే గుర్తించి హద్దులు కేటాయించి పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, కడియాల వీరాచారి, హన్మకొండ శ్రీధర్, బుర్రి ఆంజనేయులు, ఈదునూరి వెంకన్న, నాయకులు వీరేష్, బాలకష్ణ, తదితరులు పాల్గొన్నారు.