Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గ్రేటర్' ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం ?
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హన్మకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి దాస్యం ప్రణరుభాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్, వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ కుమారుడు విశాల్ బల్దియా ఎన్నికల బరిలో దిగడానికి సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభినవ్ భాస్కర్ అడపాదడపా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అతడి బాబారు చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ తోడ్పాటుతోనే రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. వినరుభాస్కర్ సోదరుడు విజరుభాస్కర్ తాజా మాజీ కార్పొరేటర్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కుమారుడు విశాల్‌ను వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడంతో ఇప్పటికే ఆ దిశగా విశాల్ పలు సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈసారి 'గ్రేటర్' ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
గ్రేటర్ వరంగల్
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కుటుంబీకులు రాజకీయ ఆరంగేట్రం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ సోదరుడు ప్రణరుభాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ ఈసారి కార్పొరేటర్‌గా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో దాస్యం వినరుభాస్కర్ ఎన్నికల ప్రచారంలోనే తరుచూ పాల్గొన్న అభినవ్ తాజాగా 'గ్రేటర్' ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ మరో సోదరుడు విజరుభాస్కర్ గత ఎన్నికల్లో 50వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన విషయం విదితమే. గత ఎన్నికల్లో రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి కోడలు సుస్మితారెడ్డి కూడా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈసారి దాస్యం విజరుభాస్కర్ పోటీ చేసే అవకాశాలుండగా గుండు సుధారాణి కోడలు సుస్మితారెడ్డి పోటీ చేస్తుందా? అన్న విషయం తేలాల్సి ఉంది. గతంలో మేయర్ పదవి జనరల్‌కు రిజర్వ్ కావడంతో మేయర్ పదవి కోసం సుధారాణి కోడలు సుస్మితారెడ్డిని రంగంలోకి దించిన విషయం విదితమే. ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో ఈసారి చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ తమ్ముడు విజరుభాస్కర్ మేయర్ పదవిని దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణరు కుమారుడు అభినవ్ భాస్కర్ రాజకీయ ఆరంగేట్రానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇదే వాస్తవరూపం దాల్చితే 'గ్రేటర్' ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతాయి.
ప్రణరు తనయుడి కోసం రంగం సిద్ధం
దాస్యం ప్రణరుభాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ ఎన్నికల్లో దాస్యం వినరుభాస్కర్ విజయానికి కృషి చేశారు. యూత్ ఫాలోయింగ్ ఉన్న అభినవ్ ఈసారి 'గ్రేటర్' ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేయడానికి తహతహలాడుతున్నట్లు సమాచారం. డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైతే ఏ డివిజన్లో పోటీ చేయాలో తేల్చుకునే అవకాశముంది. ప్రాథమికంగా 49 లేదా 50 డివిజన్ల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం విదితమే. దాస్యం వినరుభాస్కర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కోరబోయిన సాంబయ్య టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. చీఫ్ విప్ దాస్యం, కోరబోయిన నడుమ విభేదాల నేపథ్యంలోనే ఇలా జరిగిందని పార్టీలో చర్చ సాగింది. ఏది ఏమైనా 'దాస్యం' కుటుంబం నుంచి మరో నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం గమనార్హం. మాజీ మంత్రి ప్రణరుభాస్కర్ మృతి నేపథ్యంలో ఆయన సతీమణి సబిత నాడు టీడీపీ నుంచి బరిలో నిలిచి ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. ఓటమి నేపథ్యంలో ప్రణరు సతీమణి సబిత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. నాటి నుంచి సబిత, ఆమె కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. వినరుభాస్కర్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ప్రణరు సతీమణి సబిత తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ప్రణరు కుమారుడు అభినవ్ భాస్కర్ మాత్రం అన్ని ఎన్నికల్లోనూ బాబారు వినరుభాస్కర్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా 'గ్రేటర్' ఎన్నికల్లో దాస్యం అభినవ్ భాస్కర్ రంగంలోకి దిగితే విజయం సునాయసమని 'ప్రణరు' అభిమానులంటున్నారు.
రంగంలోకి విశాల్..?
'గ్రేటర్' ఎన్నికల్లో వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్ తనయుడు అరూరి విశాల్ కార్పొరేటర్‌గా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే రమేష్ తన కుమారుడు విశాల్‌ను ఇటీవల వర్ధన్నపేట నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నియామకం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విశాల్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలతో కేడర్‌కు సన్నిహితుడయ్యేలా ఎమ్మెల్యే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందినవే 'గ్రేటర్' పరిధిలో 13 డివిజన్లు ఉండడం గమనార్హం. డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు అనంతరం సేఫ్ జోన్‌ను ఎంచుకునే అవకాశముంది. తన కుమారుడు విశాల్‌ను కార్పొరేటర్‌గా గెలిపించడానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన కుమారుడు విశాల్‌ను కార్పొరేటర్‌గా గెలిపించుకొని డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 13 డివిజన్లు ఉండగా ఈసారి డిప్యూటీ మేయర్ పదవిని తన కుమారుడికి దక్కేలా చేయడానికి 'అరూరి' రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు ఈసారి 'గ్రేటర్' ఎన్నికల్లో తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపి 'గ్రేటర్'పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తుండడాన్ని ప్రజలు గమనించాలి.