Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయినందుకా వివక్ష
ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
ప్రొటోకాల్ పాటించని ఇరిగేషన్ అధికారులపై ప్రివిలేజన్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. గూండాలా, రౌడీలా పోలీసులను మోహరించి మిడతల దండులా టీఆర్ఎస్ కార్యకర్తలను వెంట పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులపై, నియోజకవర్గ రైతులపై దాడులు చేసి రామప్ప చెరువు నుంచి వంగపెల్లి చెరువుకు నీటిని తరలించుకుపోతారా? అని ప్రశ్నించారు. నీటి తరలింపును తాము వ్యతిరేకించలేదని, గుండాలా అహంకారంతో వ్యవహరిస్తే భయపడేది లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకుండా ఇరిగేషన్ అధికారులు అవమానించారని చెప్పారు. గతేడాది రామప్ప చెరువు నిండడంతో ఇంచెర్ల, జంగాలపల్లి, కేశావాపూర్, నర్సాపూర్, పాపయ్యపల్లి, బండారుపల్లి, పాల్‌సాబ్‌పల్లి గ్రామాలు పూర్తిగా నీట మునిగి పంట పొలాలు దెబ్బతినగా రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి చెరువు నుంచి నర్సంపేట, సిద్దిపేట, హైదరాబాద్, గణపసముద్రం వరకు లైన్లు వేసి నీళ్లు తీసుకుండగా నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వరన్నారు. రామప్ప చెరువు నుంచి కేశవాపూర్ అవతలి వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ములుగు నియోజకవర్గ రైతుల భూములు కోల్పోయి పరిహారం అందక ఇబ్బందులు పడుతుంటే హడావిడిగా నీటిని తరలించుకుంటారా? అని ప్రశ్నించారు. కాల్వ సరిగా లేకపోవడంతో గండ్లు పడటంతో మళ్లీ రైతుల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. గండ్లు పూడ్చకుండా, మరమ్మతులు చేయకుండా ఓపెన్ చేయడం వల్ల మళ్లీ నియోజకవర్గ రైతుల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందన్నారు. రామప్ప చెరువు నిండిన తర్వాత నియోజకవర్గ రైతుల భూములు మునిగిపోతే తానే స్వయంగా వచ్చి తుమును తవ్వుతానని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు వీరేష్, తదితరులు పాల్గొన్నారు.