Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెరువు చుట్టుపక్కల చదును..
పట్టించులోని అధికారులు
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధి కాపురం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకున్నది. మండలంలోని కాపురం, తాడిచెర్ల, పెద్దతూండ్ల, శాత్రాజ్పల్లి గ్రామాల్లోని 4వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుకు గుట్టలు జాలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారి చెరువు మత్తడి పడితే రెండు పంటలు పండుతాయని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. కానీ, చెరువు శిఖం కబ్జాకు గురికావడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చెరువుతోపాటు శిఖం కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని పలు వురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక వైపు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను, కుంటలను పూడిక తీత ద్వారా రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే మండలంలో మాత్రం కబ్జాదారుల కోరల్లో కొట్టుమితులాడుతున్న పరిస్థితి. కాపురం చెరువు గ్రామానికి దూరంగా, గుట్టలకు దగ్గరగా, ఉండటంతో... ఇటువైపుగా ఎవరు రారని, కబ్జాదారులకు అడ్డు అదుపు ఉండదనే నెపంతో చెరువు చుట్టూ చదును చేస్తున్న పరిస్థితి. ఇలాంటి అక్రమార్కుల ఆగడాలను అడ్డుకుని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాడిచెర్ల, కాపురం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కాపురం గుట్టల్లో గుప్త నిధుల తవ్వకాలు ?
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధి కాపురం గుట్టల్లో గుప్త నిధుల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కాకతీయ రాజుల కాలం నాటి పురాతన ఆలయాలు గుట్టల్లో ఉండటంతో అక్కడ పురాతన లంక బిందెలు లభిస్తాయనే దురాశతో కొన్నేళ్లుగా గుట్టలో జోరుగా తవ్వకాలు సాగుతున్నాయి. గుప్త నిధుల కోసం వేటగాల్లు ఇటీవల మల్లీ భారీగా తవ్వకాలు చేపట్టారు. ఈ అక్రమ గుప్త నిధుల తవ్వకాల కోసం కాపురం చెరువు నుండి గుట్ట వరకు అక్రమ రహదారి సైతం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. గుప్త నిధుల వేట కోసం గుట్ట ముందు ఉన్న బేతాలుడు, సీత రామ ఆలయాల్లో చొరబడి విగ్రహలు సైతం ధ్వంసం చేసి విగ్రహల కింది భాగంలో భారీగా గోతులు తవ్వకాలు చేపట్టారు. గుట్ట పై స్నానపు బావి పక్కన పురాతన రోలును సైతం ద్వసం చేశారు. రానున్న కొద్ది రోజుల్లో కాపురం గుట్టల్లో యంత్రాలతో భారీగా తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవు తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గుప్త నిధుల స్మగ్లర్లు చాకిపీస్ తో రూట్ మ్యాప్‌తో పాటు వరుస నంబర్లు వేయడమే నిదర్శనం. ఇప్పటికైనా పురావస్తు శాఖ, ఎకో టూరిజం, అటవీ శాఖ అధికారులు స్పందించి కాకతీయ రాజుల నాటి పురాతన ఆలయాలు, గుట్టలు పరిరక్షించాలని, ఎకో టూరిజంలా మార్చాలని తాడిచర్ల, కాపురం గ్రామస్తులతో పాటు పార్యటక, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.