Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జ్యోతిరావుపూలే 195వ జయంతి
నవతెలంగాణ-వరంగల్
జ్యోతిరావుపూలేను విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన మహనీయుడిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభి వర్ణించారు. మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ ములుగు రోడ్డు జంక్షన్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి దయాకర్‌రావుతోపాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఆదివారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని గ్రహించి పేదలందరూ విద్యనభ్యసించేలా చైతన్యవంతం చేశారని చెప్పారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. తద్వారా వివిధ కుల, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.
పూలే కలలు కన్న సమాజం కోసం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్
మహాత్మ జ్యోతిరావు పూలే కలలు కన్న సమాజ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సత్య వతి రాథోడ్ తెలిపారు. పేదలకు రాజ్యాధికారం, మహిళలకు విద్య ఎంత అవసరమో గుర్తించి ముందుగా తన సతీమణి విద్యను ప్రోత్సహిం చిన మహనీయుడని
కొనియాడారు. నిరుపేదలందరూ ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పూలే తపనపడే వారని గుర్తు చేశారు.
పూలే సామాజిక సంఘ సంస్కర్త : బోయినపల్లి
పూలే గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. పూలే ఆదర్శ భావాలను నేటి తరం కొనసాగించాలన్నారు.
మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత : చీఫ్ విప్ దాస్యం
మహిళల విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ కొనియాడారు. మహిళల విద్య ప్రాధాన్యతను వివరించి మహిళలను చైతన్యవంతం చేశారని చెప్పారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను మరిచిపోకూడదన్నారు. పూలే స్ఫూర్తితో యువత సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీసీ సంక్షేమ అధికారి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.