Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వానకాలంలో అతి వర్షాలు, పంటంతా రోగాలతోనే సరిపోయింది. యాసింగి పంటలోనూ రోగాలు.... నిన్న మొన్నటి దాకా నీటి ఎద్దడి ఇక్కట్లు తప్పలేదని, సచ్చి చెడీ పండిన పంటను రాళ్లవాన రాలగొట్టి పోయిందని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మండలంలోని నమిలిగొండ, ఇప్పగూడెం, సముద్రాల, అక్కపల్లి గూడెం, రంగరాయి గూడెం, కోమటి గూడెం, థానేదార్ పల్లి గ్రామాల్లో సోమవారం కురిసిన అకాల వర్షం బీభత్సం సష్టించింది. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పలుచోట్ల నష్టాన్ని మిగిల్చింది. మామిడి తోటల్లో సైతం కాయలు నేల రాలాయి. ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతులకు ఆపార నష్టం జరిగింది. పంట దెబ్బతినడంతో పెట్టుబడికి అప్పు తెచ్చిన డబ్బులు తీరే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కరోనా వైరస్‌తో ఆందోళన చెందుతున్న రైతులకు వడగండ్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని రౖతులు కన్నీరు మున్నీరవుతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ పద్ధతిలో ముఖ్యంగా వరి పంటను మాత్రమే సాగు చేయాలనే ఆలోచనలో భాగంగా మండలంలో యాసంగి సీజన్లోమ సుమారు 14వేల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. చేతి కొచ్చే సమయానికి అకాలవర్షం ఆగం చేసిందని వాపోతున్నారు. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందనే అంచనా. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను రైతులు వేడుకుంటున్నారు.
వరి పంటకు తీరని నష్టం : పాలెపు వెంకటమల్లు,నమిలిగొండ
అకాల వర్షంతో వరిపంటకు తీరని నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన పంట వడగండ్లు, ఈదురుగాలులతో వరి గింజలు నేలరాలాయి. నాకున్న ఎకరంలో వరిపంట వేశాం. వడగండ్ల వర్షంతో 50 శాతానికిపైగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి
రైతాంగాన్ని ఆదుకోవాలి : దాసి రాజు యువ రైతు, నమిలిగొండ
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. కరువు పరిస్థితుల్లోనూ 3ఎకరాల పంటకు రూ.50వేలకు పైగా అప్పు చేసి వేశాం. ఓ వైపు ఎరువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాలకులు, ప్రభుత్వాలు ఆలోచించి, పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలి.
నష్టపరిహారం చెల్లించాలి : కోడెపాక యాకయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
ఉన్నకొద్దిపాటి వ్యవసాయ భూమిలో అప్పులు చేసి పంటలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలి. మండల పరిధిలో రైతులు పెద్ద ఎత్తున వరి పంట, మామిడి తోటలు, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేశారు. అకాల వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి, పంటను అంచనా వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వారందరిని గుర్తించి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలి.లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.
వివరాలు సేకరించి ఉన్నాతాధికారులకు పంపిస్తాం
మండల వ్యాప్తంగా ఈ సీజన్ కు గానూ వరి సాగు 14వేల ఎకరాల్లో రైతులు పంట పండించారు. కాగా ఇటీవల అకాల వాతావరణ మార్పులకు 852 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా. క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపిస్తాం.
-ఏ నాగరాజు, మండల వ్యవసాయాధికారి, స్టేషన్‌ఘన్‌పూర్