Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కరోనా నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాల్సిందేనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోని అకాడమిక్ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో మంగళవారం ఆయన కుటుంబీకులతో కలిసి రెండో డోస్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడారు. ప్లవ నామ సంవత్సరంలో కరోనా అంతమై ప్రజలందరూ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. టీకా పట్ల అపోహలు అవసరం లేదన్నారు. టీకా పూర్తిగా సురక్షితమైనదని తేటతెల్లం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో టీకా ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రులందరూ రెండో డోసులు టీకా వేసుకున్నారని చెప్పారు. తాను కుటుంబంతో సహా ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా వేసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందన్నారు. టీకా కోసం ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, పేదలందరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే టీకా వేసుకోవాలని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతిఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పక్క రాష్ట్రాల కన్నా తెలంగాణలో వ్యాప్తి తక్కువేనని, అయినా వైరస్ను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా నిర్మూలన కోసం క్రియాశీలకంగా పని చేస్తోందన్నారు. కరోనా పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తేటతెల్లం చేశారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవడంతోపాటు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని చెప్పారు. అలాగే టీకా తీసుకున్నప్పటికీ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ
తప్పనిసరిగా టీకా వేసుకోవాలని, 60 ఏండ్లకుపైబడ్డ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారూ టీకా వేయించుకోవాలని చెప్పారు. టీకా వేయించుకుంటే శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తే రాష్ట్రం త్వరలోనే కరోనా రహితం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర లలితాదేవి, తదితరులు పాల్గొన్నారు.