Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్ధేశం
- ప్రచారం ప్రారంభం..
- కార్పొరేషన్ ఎన్నికల కోసమే..
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరేయడంలో భాగంగానే సోమ వారం పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ డం గమనార్హం. ఏ సందర్భంలోనైనా వరంగల్‌లో టీఆర్ఎస్కు అండగా ఉండాలని కేటీఆర్ ప్రజలను కోరారు. దౌర్భాగ్యమైన బీజేపీ పద్ధతి మార్చుకోవా లని, సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కార్యకర్తలు ఊరుకోరని దిశానిర్ధేశం ఇచ్చి వెళ్లడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించ డం, గ్రేటర్ హైద్రాబాద్‌లో గట్టి పోటీనివ్వడంతో చెలరేగిన బీజేపీని మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటనలో టార్గెట్ చేసి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరుకోవని వ్యాఖ్యానించడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్ధేశం ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆద్యం తం వరంగల్ నగర పర్యటనలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్‌లో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో న్యూశాయంపేటలో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ముందే ప్రారం భించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే గ్రేటర్ వరంగల్ నగరంలో రూ.2,578 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ ఎగిరితే ఏడేండ్లుగా ఇంత అభివృద్ధి చేస్తున్న మే మెంత ఎగరాలని వ్యాఖ్యానించడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎక్కడికక్కడ ఎండ గట్టాలన్న లక్ష్యంతో గులాబీ దళం సమాయత్తమవుతుంది.
టార్గెట్ బీజేపీ
మంత్రి కేటీఆర్ బహిరంగ సభల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వని బీజేపీ నేతలు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే బీజేపీ నేతలకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ నేతలకు ఇదే చివరి వార్నింగ్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పద్దతి మార్చుకోకపోతే మోదీ, అమిత్‌షాలను వదలమని హెచ్చరించారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకొని రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ పర్యటనతో స్పష్టమైంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగే అవకాశముంది.
మంత్రి కేటీఆర్ పర్యటనతో ప్రచారం షురూ..
మంత్రి కేటీఆర్ నగర పర్యటన గతేడాదిగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సోమవారం మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాన్ని పర్యటించడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం ప్రారంభించినట్టయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మంత్రి కేటీఆర్ పర్యటించడం ద్వారా పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని సంకేతం ఇవ్వగలిగారు. రాబోయే రోజుల్లో వరంగల్ నగరం రూపురేఖలు మారుతాయని నగరవాసుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఈనెల 15న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల ముందే కేటీఆర్ వరంగల్ నగరంలో రూ.2,578 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం వెనుక వచ్చే ఎన్నికల్లో విజయం కోసమనేది బహిరంగ రహస్యమే. వరంగల్ నగరంలో అటు వరంగల్ తూర్పు, ఇటు వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 5 నియోజకవర్గాల పరిధిలో వుండడం గమనార్హం. పర్యటనలో ముందుగానే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని రాంపూర్‌లో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో బల్ధియాపై గులాబీ జెండా ఎగురవేయడానికి రాజకీయ వ్యూహంలో భాగంగానే మంత్రి కేటీఆర్‌ను ఎన్నికల నోటిఫికేషన్ ముందు నగరానికి తీసుకువచ్చారు.