Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లాల్లో తడిసిన మిర్చి
- నేలకొరిగిన మొక్క జొన్న, వరి పంటలు
- పూత రాలిన మామిడి
నవతెలంగాణ-వెంకటాపురం/బయ్యారం
అకాల వర్షం రైతులు కంట్లో కన్నీరు నింపింది. చేతికొచ్చిన వరి పంట, మొక్క జొన్న నేలకొరిగింది. కల్లాల్లో మిర్చి పంట తడిసిపోయింది. గతేడాది చేసిన అప్పులు, ఈ ఏడాది పంట ఖర్చులు వస్తాయని ఆశించిన రైతులకు అకాల వర్షం కడగండ్లను మిగిల్చిందని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో సుమారు 4,995 ఎకరాల్లో మిర్చి, 2272 ఎకరాల్లో మొక్క జొన్న 1717 ఎకారాల్లో యాసంగి వరి సాగు చేస్తున్నారు. రెండు రోజులుగా ఈదురుగాలులకు వడగండ్ల వాన తోడవ్వడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. టార్ఫాలిన్లతో పంటను రక్షించుకునే పనిలో పడ్డారు. తడిసిన మిర్చి కాయలు రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న వరి పంట కంకులు ఈదురుగాలులకు రాలిపోయాయి. ఎకరానికి ముప్పై బస్తాలు పండుతుందని అనుకున్న రైతులు 10 బస్తాలు కూడా పండే అవకాశం లేక పోవడంతో రైతుల అశలు అడియిశలవుతున్నాయి. మొక్కజొన్న పంట నేలవాలగా మామిడి కాయలు రాలిపోయాయి. అయితే మొదటి దఫా మిర్చి అమ్ముకున్నామని, రెండు, మూడు కోతలొస్తే చేసిన అప్పులు తీరతాయని అనుకుంటే నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
బయ్యారంలో రైతన్న అరిగోస
అకాల గాలి దుమారంతో కూడిన వర్షాలు మండలంలోని రైతుల కంట కన్నీరు పెట్టిస్తు న్నాయి. నిన్న మొన్నటి వరకు సూర్యుడి భగభగలకు పంట ఎండిపోతుందమోనని భయపడిన రైతులకు అకాల వర్షాలు ఊహించని కష్టాన్ని తెచ్చి పెట్టాయి. మంగళ వారం రాత్రి కురిసిన వర్షానికి పంట నష్టం సంభవించింది. మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో ఎండబెట్టుకుని ఉన్న మొక్కజొన్న పంట, మిర్చి పంట తడిసి ముద్దయ్యాయి. గాలి దుమారం, వడగండ్ల వాన వల్ల వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలవాలాయి. పత్తి, మిర్చి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తడిసిన మొక్కజొన్న, మిర్చిను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మండల రైతులు కోరుకుంటున్నారు.
నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి
అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. అకాల వర్షం కారణంగా మండలంలో సాగుచేస్తున్న రైతుల మొక్కజొన్న, పత్తి, మిర్చి, మామిడి పంటలు, వరి తీవ్రంగా దెబ్బతిన్నాయి. తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులను నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
- రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నంబూరి మధు