Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన మిర్చి
- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-శాయంపేట
రెండు రోజులుగా రాత్రి వేళల్లో కురుస్తున్న అకాల వర్షానికి ఆరు గాలం శ్రమించి పండించిన పంట తడిసిపోయి అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు. మండలంలోని కాట్రపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని రాజుపల్లి, సాదోనిపల్లి, నూర్జహాన్ పల్లి గ్రామాలలో 460 ఎకరాలు మిర్చి పంట సాగు కాగా, మండలంలోని మిగిలిన గ్రామాలలో కేవలం నూట నలభై ఎకరాల మిర్చి పంటను రైతులు సాగుచేశారు. మిర్చి పంట చేతికి వచ్చి కల్లాలలో ఆర పెడుతుండగా ప్రకతి కన్నెర్ర చేయడం, సోమ, మంగళవారం రాత్రి వేళలో కురిసిన వర్షాలకు పంట తడిచిపోయింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఆరుగాలం శ్రమించి మిర్చి పంట సాగు చేయగా ఎకరాకు 80 వేల వరకు పెట్టుబడి అయ్యిందని, పంట చేతికి రాగా కల్లాలలో ఆరబెట్టమని, గత రెండు రోజులు గా రాత్రి వేళలో అకాల వర్షాలు కురియడంతో పంట తడిసి బూజు పట్టిందని, తడిసిన మిర్చి రంగు మారే పరిస్థితి ఉందని, పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు పాక రాజయ్య, చేరా లు, పొడమేకల సంపత్, శ్రీను, తుమ్మల శ్రీనివాస్, గంగ సది, రైతులు వేడుకుంటున్నారు. కాట్రపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామాలలో మాత్రమే మిర్చి పంట సాగు అయిందని, నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గణపురం: మండలంలో రెండురోజులుగా కురుస్తున్న అకాలవర్షంతో మిర్చి కల్లాల వద్ద తడిసి ముద్దయింది. రైతులు ఏరిన మిర్చిని కల్లావ వద్ద అరబోశారు. అదే విధంగా వరి నారు వర్షానికి కిందపడిపోయింది. పండుగపూట చెతికందే పంటలు నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీ రవు తున్నారు. పంటనష్టపోయి దానిని సర్వే చేసి అదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడి చెర్లతో పాటు మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి అకాల ఈదురు గాలులు మ తేలికపాటి వడగండ్ల వానతో వరి పంటలు నేల రాలాయి. వరి, మామిడి రైతులకు అపారంగా నష్టం వాటిల్లినట్టు రైతులు తెలిపారు. నేలరాలిన పంటను ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు పరిశీలించారు. వ్యవసాయ అధికారులతో సర్వేలు నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కమలాపూర్: అకాల వర్షాల చేత చేతికొచ్చిన పంట నేలకొరిగింది. కమలాపూర్ మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వందల ఎకరాల వరి పంట నేలకొరిగింది. కొన్ని గ్రామాలలో వరి ధాన్యం మిర్చి తడిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాల చేత తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నడికూడ: మండలంలోని కౌకొండ గ్రామంలో అకాల వర్షంతో చేతికందిన మొక్కజొన్న నేల మట్టమైందని రైతు మోర్తాల శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంటలు పండిస్తే చేతికొచ్చిన పంట అకాల వర్షంతో నేలమట్టం కావడంతో అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎకరాలలో మొక్కజొన్న వేస్తే అకాల వర్షానికి ఎకరం నర మొక్కజొన్న నేలమట్టం అయిందని దాదాపు ఒక లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతు వాపోతున్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షంతో కళ్ళలలోని మిర్చి తడిసి ముద్దయిందని రైతులు లబోది బోమంటున్నారు.
పర్వతగిరి: మండలంలోని కొంకపాక గ్రామంలో కోతుల యాదగిరి అనే రైతు రెండు ఎకరాల మొక్కజొన్న పంట వేసినాడు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. ధీంతో సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు వాపోతున్నాడు. అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందంటూ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ధ్వారా పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.