Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాకాలనీలో పాజిటివ్ డెత్‌గా ప్రచారం
- ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండల కేంద్రం హసన్‌పర్తిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులు ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికి పాజిటీవ్ కేసుల పట్ల ఉన్న అపోహలతో భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగు తోంది. గతంలో హసన్‌పర్తిలో సౌందర్య అనే వృద్దురాలుకు కరోనా పాజిటీవ్ వచ్చిందన్న ఆరోపణలతో భయాందోళనకు గురై హసన్‌పర్తి ప్రధాన కూడళిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం మరిచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం ప్రజల్లో మరింత భయానక వాతావరణం నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా హసన్పర్తికి చెందిన ఇమ్మడి అమృతమ్మ (65)కు రెండు రోజుల క్రితం హసన్‌పర్తి ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకోగా ఆమెకు పాజిటీవ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కరోనా పాజిటీవ్ వచ్చిన అమృతమ్మకు వైద్య సిబ్బంది సరియైన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి మందుల కిట్టు అందజేసి ధైర్యంగా ఇంటికి పంపించారు. అయితే రెండురోజులుగా కరోనా పాజిటీవ్ వచ్చినట్లు మానసిక ఒత్తిడికి గురై విషగూళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గ్రామంలో మాత్రం కరోనా పాజిటీవ్‌తోనే మృతి చెందినట్లు ప్రచారం ఊపందుకోవడంతో కరోనా సెకండ్ వేవ్ భయం ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
వాక్సినేషన్ తప్పని సరిగా వేసుకోవాలి
- మండల వైద్యాధికారి డాక్టర్ సునిల్‌దత్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ సునిల్‌దత్ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరు ముందస్తుగా కరోనా వాక్సినేషన్ చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య కొంత మేరకు ఉన్నప్పటికి వాటి నుంచి ప్రాణ రక్షణ కోసం కోవిడ్ వాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రాణ హాని నుంచి కొంత మేరకు రక్షించుకోవచ్చని డాక్టర్ సునిల్‌దత్ పేర్కొన్నారు.