Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మద్యం సేవించి తన సోదరిని కొడుతున్న క్రమంలో అడ్డుకోబోయిన బామ్మర్దిని బావ కత్తితో పొడిచి చంపిన విషాద సంఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి గండితండాకు చెందిన గుగులోత్ అశోక్ తన భార్య రాణిని మద్యం సేవించి చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో రాణి తమ్ముడు ఇదే గ్రామానికి చెందిన బానోత్ వేణుగోపాల్(16) అశోక్‌ను అడ్డుకున్నాడు. మద్యం మత్తులో లో ఉన్న అశోక్ కోపోద్రిక్తుడై వేణుగోపాల్ ను కడుపులో కత్తితో పొడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు వేణుగోపాల్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. నిందితుడు అశోక్ పోలిస్ స్టేషన్లో లొంగి పోగా ఎస్సై బాదా వత్ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మానుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హంతకుడిని కఠినంగా శిక్షించాలని రాస్తారోకో
10వ తరగతి చదువుతున్న విద్యార్థి వేణుగోపాల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన అశోక్ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బుధవారం స్థానిక నెహ్రూ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో కు సీపీఐ(ఎం), ఎన్డీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, జి సక్రులు మద్దతిచ్చి మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మండల కేంద్రానికి తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు గార్ల-బయ్యారం సీఐ కె తిరుపతి, ఎస్సై బాదావత్ రవి, బయ్యారం ఎస్సై జగదీష్, సిబ్బంది, ు ప్రత్యేక బలగాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును ఎర్పాటు చేసారు.