Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రఘునాథపల్లి మండల కార్యదర్శి పొదల నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గొలనుకొండ చక్రపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కంచనపల్లి, గబ్బేట,కోడూరు, కన్నాయి పల్లితో పాటు పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పని చేసే రైతన్నకు నిత్యం కష్టాలు తప్పడం లేదని అన్నారు. ఓ వైపు కరోనా మహమ్మరితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అకాల వర్షంతో మరింత నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి ఎరువుల ధరల్ని పెంచి రైతులకు తీరని అన్యాయాన్ని చేస్తున్నాయని విమర్శించారు. వడగండ్ల వానతో సగానికి సగం వరి పంట క్షేత్రస్థాయిలో నేల పాలైనట్టు తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అకాలవర్షంతో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైలారం వెంకటేశ్వర్లు, వారాల రాజు, నాల్కపల్లి దావీద్, కడారి ఐలయ్య, గట్టయ్య, పొదల దేవేందర్, లవ కుమార్, తదితరులు పాల్గొన్నారు.