Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసారి తూర్పా..? పశ్చిమ..?
- గాడ్ ఫాదర్ల చుట్టు ప్రదక్షిణలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై కన్నేసిన బీసీ నేతలు ఇప్పటి నుంచే గాడ్ ఫాదర్ల చుట్టు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. మేయర్ పదవి బీసీి జనరల్‌కు రిజర్వ్ కావడంతో టీఆర్ఎస్లో పోటీ తీవ్రతరమైంది. ఇటీవల నగరంలో జరిగిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆయన దృష్టిలో పడడానికి తీవ్రంగా ప్రయత్నించారు. గత పాలకవర్గంలో రెండుసార్లు మేయర్ పదవిని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీిఆర్‌ఎస్ కార్పొరేటర్లే దక్కించుకోగా, ఈసారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ తీవ్రతరం కానుంది. ఈసారి మేయర్ పీఠం ఏ నియోజకవర్గానికి దక్కనుందనే విషయం ఆసక్తికరంగా మారింది. బల్దియా ఎన్నికల్లో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశముండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
నవతెలంగాణ-వరంగల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకోవడానికి పార్టీలోని బీసీ నేతలు సన్నద్ధమయ్యారు. ఎమ్మెల్యేల నుండి మొదలు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరకు తమ పేరు వెళ్లేలా ప్రయత్నిస్తున్నారు. మంత్రుల ఆశీర్వాదం కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలోనూ ఆయన దృష్టిలో పడడానికి నేతలు పోటీపడడం గమనార్హం. గత పాలకవర్గంలో రెండుసార్లు మేయర్ పదవి వరంగల్ తూర్పు నియోజకవర్గానికే దక్కింది. గత పాలకవర్గంలో టీఆర్ఎస్ నుండి మొదట నన్నపనేని నరేందర్ మేయర్ కాగా, ఆయన ఎమ్మెల్యే కావడంతో మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రెండో విడత మేయర్‌గా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన గుండా ప్రకాశ్‌రావు మేయర్ అయ్యారు. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ప్రాధన్యతనిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
'మేయర్' కోసం పోటాపోటీ
అధికార టీఆర్ఎస్ లో మేయర్ పదవిపై కన్నేసిన బీసీి నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు గుండేటి నరేందర్‌కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి. రమేష్‌బాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ తమ్ముడు దాస్యం విజరుభాస్కర్, సుందర్రాజ్ యాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వద్దిరాజు రవిచంద్ర, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ను వీడి టిఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో 'వద్దిరాజు'కు మేయర్‌కు అవకాశం ఇస్తారా ? లేక మరో పదవిని ఇచ్చి గౌరవిస్తారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. 'వద్దిరాజు' తక్కువ సమ యంలోనే పార్టీ అధిష్టానానికి దగ్గరయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌కు అత్యంత సన్నిహితుడైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే నరేందర్ మద్దతు కూడా 'దిడ్డి'కే వుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికే చెందిన మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు గుండేటి నరేంద్రకుమార్ కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే 'గుండేటి' పలువురు సీనియర్ నేతలను కలుసుకొని మద్దతు కోరారు. ఖిలా వరంగల్‌లో మంత్రి కేటీఆర్ బహిరంగసభ సక్సెస్ కావడానికి వరంగల్ తూర్పు నేతలు గుండేటి నరేంద్రకుమార్, దిడ్డి కుమారస్వామి, టి. రమేష్‌బాబు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఈ ముగ్గురు బిసి నేతలు కావడం గమనార్హం ఇందులో 'దిడ్డి'కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ దాస్యం విజరుభాస్కర్ ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్‌కు స్వయాన తమ్ముడు. ఇదిలావుంటే గతంలో మేయర్ పదవిని వరంగల్ తూర్పు నేతలకు ఇచ్చినందునా, ఈసారి వరంగల్ పశ్చిమకే దక్కాలని ఛీఫ్ విప్ పట్టుపట్టే అవకాశం లేకపోలేదు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. పరకాల నియోజకవర్గానికి చెందిన 'నాగుర్ల' గతంలో భూపాలపల్లి నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సుందర్రాజ్ యాదవ్ మాస్టర్జీ విద్యాసంస్థల అధిపతి ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా దక్కలేదు. ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈసారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మేయర్ పదవినిస్తే మాకంటే మాకే దక్కుతుందని వీరు ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సంకేతాలివ్వని అధిష్టానం
ఇప్పటి వరకు వరంగల్ మేయర్ పదవిపై అధికార టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవ్వరికీ సూచనప్రాయంగా గ్రీన్‌సిగల్ ఇవ్వలేదని సమాచారం. పలువురు నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిసినా 'చూద్దాం' అనడం మినహా ఎవరికి ఇప్పటి వరకు హామినివ్వలేదని తెలుస్తుంది. అతిత్వరలో డివిజన్ల రిజర్వేషన్లు ఖరారై గ్రేటర్ వరంగల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక పరిస్థితిని అంచనా వేసి పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.