Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్ వద్ద బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ చేసిన సేవలు విశిష్టమైనవని అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన సందర్భంగా అభివృద్ధి ఫలాలను నిరుపేదల చెంతకు చేరాలని బృహత్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను రెండింతలుగా చేసి అమలు పరుస్తుందన్నారు. ఉన్నత విద్యకు కేటాయించిన రూ.10లక్షల్ని రూ.20 లక్షలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేరాఆర్ షెడ్యూల్డ్ కులాల ప్రజలు కోరుకునే విధంగా మరిన్ని అభివృద్ధి పథకాలను అమలు చేయాలనే గొప్ప ఉద్దేశంతో రూ.వెయ్యి కోట్లు కేటాయించారని అన్నారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందరికి అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, సామాజిక అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. మహిళలను పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా గిరిజన ప్రాంతమని, జనాభా 50 శాతం పైగా ఉందని, ప్రతి వెయ్యి మందికి 885 మంది మాత్రమే మహిళలు ఉన్నారని అన్నారు. ఆడపిల్లల శాతం పెరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించాలని అన్నారు. బాల్య వివాహాలు చేయొద్దన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటిన వారు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కొమరయ్య, జిల్లా అధికారులు రావూరి రాజు, బాలరాజు, సూర్యనారాయణ, సబిత, సుధాకర్, తాసిల్దార్ రంజిత్, జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.