Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- 30న పోలింగ్... మే 3న ఫలితాలు
- 60 డివిజన్ల రిజర్వేషన్ ఖరారు..ఆ వెంటనే షెడ్యూల్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలతో పాటు రాష్ట్రంలో మరో ఐదు మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ వెలువడింది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 18వ తేదీతో ముగుస్తుంది. ఈనెల 30న పోలింగ్, మే 3వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. డివిజన్ల వర్గీకరణ, అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్లు ఇలా ఒకదాని వెంట ఒకటి గత నెలరోజులుగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికారయంత్రాంగం ఉరకలు పరుగులు తీస్తోంది. దీనిలో భాగంగా గురువారం ఉదయం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి ఆయా పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. డివిజన్ల రిజర్వేషన్‌పై చర్చించి డ్రా తీశారు. ఈ ప్రక్రియ పూర్తయిన కొద్ది నిమిషాల్లోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. కాలయాపన జరిగితే రిజర్వేషన్లు, ఇతరత్ర అంశాలపై కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా ఇలా ఆగమేఘాల మీద అధికార పార్టీ నోటిఫికేషన్ విడుదల చేయించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్..
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల తిరస్కృతిపై 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలనాంతరం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా ఉన్న నామినేషన్లను 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తిరస్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆ వెంటనే వివిధ డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడితే తిరిగి మే 2వ తేదీ నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ చేపట్టి... ఫలితాలు వెల్లడిస్తారు.
రిజర్వేషన్లు ఖరారు
ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 219 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ తేదీ 2-8-2019, సెక్షన్ 7, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ -2019 ప్రకారం జిల్లా కలెక్టర్‌కు కల్పించిన అధికారాలకు అనుగుణంగా ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్‌ను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి గురువారం ఉదయం ప్రకటించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి డ్రా పద్ధతిన రిజర్వేషన్లు నిర్ణయించారు. ఈ మేరకు ఎస్టీలకు మూడు, ఎస్పీలకు ఏడు, బీసీలకు 20, జనరల్ మహిళలకు 16, మరో 14 డివిజన్లను అన్ రిజర్వుడ్‌గా ప్రకటించారు. ఎస్టీ ఉమన్ 32, ఎస్టీ జనరల్‌కు 1, 8 వార్డులు, ఎస్సీ ఉమన్‌కు 22, 42, 59, ఎస్సీ జనరల్ 40, 43, 52, 60 వార్డులు, బీసీ ఉమన్‌కు 28, 29, 30, 33, 34, 38, 46, 47, 48, 57, బీసీ జనరల్‌కు 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 వార్డులు, జనరల్ మహిళలకు 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 డివిజన్లను రిజర్వ్ చేశారు. 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41, 45, 49, 50 వార్డులను అన్ రిజర్వ్ చేశారు. ఈ రిజర్వేషన్లతో తాజా మాజీ కార్పొరేటర్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదని తెలుస్తోంది. తాము ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో ఏదో ఒక ప్రాంతం నుంచి అనుకూలంగా రిజర్వేషన్ కేటాయింపులు జరిగాయని వారంటున్నారు.