Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చింతగట్టులో దారుణం
- పాత కక్షలే కారణమంటున్న మృతుని బంధువులు
- పరారీలో నిందితుడు
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేయూ పోలీసు స్టేషన్ పరిధి చింతగట్టు సుభాష్‌నగర్ కాలనీ ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో ఓ బెల్టు షాపు వద్ద దారుణం చోటు చేసుకుంది. పట్ట పగలే మద్యం తాగించి యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికులను కలిచివేసింది. పాతకక్షలు, వివాహేతర సంబందమే దారుణ హత్య కు కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీ సులు, మృతుని తల్లి నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం హసన్‌పర్తి బుడిగ జంగాల కాలనీకి చెందిన మోత లక్ష్మయ్య నర్సమ్మ దంపతుల చిన్న కుమారుడు మోతె చందు(26) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఇదే గ్రామానికి చెందిన పస్తం అయిలు కొమురు తన మేనత్త కుమారుడు చందుతో అత్యంత చనువుగా ఉండేవాడు. దీనిని అదునుగా చూసుకుని ఓ హత్య కేసులో నిందితుడైన చిత్తారి కోటిలింగంతో పాటు అతని బంధువు వెంకట్రాజంలతో చందు కుటుంబ సభ్యులకు ఇటీవలే గొడవ జరి గింది. దీంతో ఇరు వర్గాలు హసన్‌పర్తి పోలీసులను ఆశ్రయించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంతేకాకుండా హత్య కేసులో నింది తుడైన చిత్తారి కోటిలింగంకు కోర్టులో ప్రధాన సాక్షిగా చందు ఉన్నట్టు ప్రచారం. దీనికి తోడు ఇటీవల కేయూ పోలీసులు ఇటీవల బియ్యం డంపును పట్టుకోవడంలో చందు పాత్ర కీలకమన్న ఆరోపణలున్నాయి. మృతుడు చందుకు, హత్య కేసులో నిందితుడైన కోటిలింగంల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే అదునుగా బావించిన చిత్తారి కోటిలింగం, వెంకట్రాజంలు చందును ఎలాగైన మట్టుపెడితే తమ బియ్యం వ్యాపారానికి అడ్డు ఉండదని, కోర్టులో సాక్ష్యం కూడా వీగిపోతుందన్న నేపథ్యంలో పథకం ప్రకారం చందు హత్యకు ప్రణాళిక రూపొందించినట్టు మృతుని తల్లి నర్సమ్మ ఆరోపించింది. ఇదే క్రమంలో చందు మేనమామ కుమారుడు పస్తం రాజకోమురును పావుగా వాడుకొని చందు హత్యకు ప్రణాళిక రచించినట్టు ఆరోపణలున్నాయి.
హత్య జరిగిన తీరు..
పస్తం అయిలుకొమురు మేనమామ కుమారుడు చందు వీరిద్దరు కలిసి చింతగట్టు సుభాష్‌నగర్ కెనాల్ సమీపంలోని ఓ బెల్టు షాపులో మద్యం సేవించారు. ఈ క్రమంలోనే వారి మద్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. పస్తం అయిలుకొమురు తన అన్న భార్యతో వివాహేతర సంబంధం ఉందని చందు గొడవకు దిగినట్లు నింది తుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే వీరి మద్య ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో అయిలుకొమురు మద్యం సేవిస్తున్న ఓసీ ఫుల్ బాటిల్‌ను పగులగొట్టి చందు మెడ కోసినట్లు స్థానికులు తెలిపారు. రక్తపు మడుగులో చందు విలవిలలాడుతుండగా చేతి రుమాలుతో అయిలుకొమురు చేతి రుమాలుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు.
బియ్యం వ్యాపార లావాదేవిలే హత్యకు కారణం
బియ్యం వ్యాపార లావాదేవిలే హత్యకు కారణమని మృతుని తల్లి నర్సమ్మ ఆరోపించింది. పాత కక్షలు మనసులో పెట్టుకొని చిత్తారి కోటిలింగం, వెంకట్రా జంలు తన కొడుకును హత్య చేయించారని నర్సమ్మ పోలీసులకు తెలిపింది. తన కుమారుడిని హత్య చేసేం దుకు పస్తం అయిలుకొమురును ఉసిగొలిపారని మృతు ని తల్లి నర్సమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి
చింతగట్టు సుభాష్‌నగర్ కాలనీ ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో హత్య జరిగినట్టు 100 డయల్ కాల్ రావడంతో కేయూ ఇన్స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి, ఎస్సై చంద్రమోహన్, పీసీ మధులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న చందు మృత దేహాన్ని పరిశీలించి క్లూస్ టీం సిబ్బందిని పిలిపించి మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆధారాలను సేకరించారు. చందు హత్యకు దారి తీసిన కారణాలను వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. అనంతరం చందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం చందు పార్థీవదేహాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.