Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీలకు 11, ఎస్టీలకు 2 బీసీలకు 20, అన్రిజర్వ్డ్ 33 డివిజన్లు
- 50 శాతం మహిళలకు రిజర్వ్
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 వార్డులకుగాను వార్డులవారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియకు రాష్ట్ర మున్సిపల్ శాఖ, హైద్రాబాద్ నుండి అదనపు సంచాలకులు పంఖజా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కార్పొరేషన్లో వార్డులవారీగా రిజర్వేషన్లు పూర్తయ్యాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ వార్డులను రిజర్వ్ చేశామన్నారు. జిల్లాలో వార్డులవారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నామని తెలిపారు. 1 జనవరి, 2001 విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం వార్డులవారీగా ఉన్న జనాభా, అందులో బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా జనాభా లెక్కలు తీసుకొని అధిక సంఖ్యలో వున్న వారికి ఆ వార్డును కేటాయించడం జరిగిందన్నారు. మహిళా వార్డులను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు 66 వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలు అధికంగా వున్న జనాభా ప్రాతిపదికన 2 ఎస్టీ, 11 ఎస్సీ, 20 బిసి, 17 జనరల్ మహిళ, 16 జనరల్‌కు ఖరారు చేయడం జరిగిందన్నారు. అందులో 2, 65వ వార్డు ఎస్టీలకు కేటాయించగా, డ్రా పద్దతిన 65 వార్డును ఎస్టీ మహిళకు, 2వ వార్డును ఎస్టీ జనరల్‌కు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా 11 వార్డులు ఎస్సీలకు రిజర్వ్ చేయగా, డ్రా పద్దతిన 1, 3, 14, 43, 46 ఈ ఐదు వార్డులు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 ఆరు వార్డులు ఎస్సీ జనరల్‌కు కేటాయించడం జరిగిందన్నారు. 20 బిసిలకు కేటాయించిన వార్డులలో 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్లను బిసి మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లను బిసి జనరల్‌కు కేటాయించడం జరిగిందని తెలిపారు. 33 వార్డులలో 17 వార్డులు ఇందులో 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63, 64 డివిజన్లను జనరల్ మహిళలకు కేటాయించగా, మిగిలిన 16 డివిజన్లు 4, 5, 7, 13, 22, 27, 311, 35, 45, 51, 52, 56, 60, 61, 62, 67 అన్రిజర్వ్డ్ జనరల్‌కు కేటాయించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లాటరీ పద్దతిని అనుసరిస్తూ వార్డులవారీగా 50 శాతం మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరుగుతుందన్నారు.
నిష్పాక్షికంగా ఎన్నికలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి సమన్వయ సమావేశాలు నిర్వహించామని, పోలింగ్ కేంద్రాల వారీగా హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వెబ్ క్యాస్టింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
878 పోలింగ్ కేంద్రాలు
66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు బ్యాలట్ పద్దతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి 800 మంది ఓటర్లను మించకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించిన అనంతరమే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను నియమించి నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, బల్దియా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.